భద్రాద్రిలో బాలిక పీకకోశాడు | Sakshi
Sakshi News home page

భద్రాద్రిలో బాలిక పీకకోశాడు

Published Thu, May 28 2015 2:23 AM

భద్రాద్రిలో బాలిక పీకకోశాడు - Sakshi

భద్రాచలం: అభం శుభం తెలియని బాలిక గొంతు కోసి ఓ యువకుడు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల రోడ్‌లోని కేకే ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా ఉంటున్న పోశారపు జాన్‌రాజు యూబీ రోడ్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సమీపాన బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని దుకాణం పక్కనే జగదీష్ అనే యువకుడు సీటు కవర్లు(రెగ్జిన్) కుట్టే షాప్ నిర్వహిస్తున్నాడు. గురువారం తన పుట్టిన రోజు అని చెప్పిన జగదీష్ ఉదయం పూట జాన్‌రాజు ఇంటికి వెళ్లి అతని భార్య మెర్సీ, బాలిక ఇందు వర్షితకు స్వీటు ప్యాకెట్లను వచ్చాడు. సాయంత్రం చీకటి పడిన తర్వాత మళ్లీ వారి ఇంటికి వెళ్లి కొబ్బరి బొండాల నీటిని పాపకు తాగించాడు.

సైకిల్ తాళం పోయిందని చెప్పి జగదీష్ ఆ ప్రాంతంలో వెతుకుతుండగా, మెర్సీ ఇంట్లోకి వెళ్లి కొవ్వొత్తి తెచ్చి ఇచ్చి, ప్యాన్ ఆఫ్ చేసేందుకని ఇంట్లోకి వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి పాప ఇందు వర్షిణిని చీకటిగా ఉన్న ఓ మూలకు తీసుకెళ్లడంతో ఆమె అక్కడికి వెళ్లి చూసే సరికి చిన్నారి రక్తపు మరకలతో  గిలగిలా కొట్టుకొంటోంది. తన బిడ్డ పీక కోశాడని గమనించిన ఆమె జగదీష్ చేయిపట్టుకొని అడ్డుకొని.. పెద్దగా అరుపులు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

ఇది గమనించిన జగదీష్, మెర్సీ చేయిపై బలంగా కొట్టి విడిపించుకొని పరారయ్యాడు. వెంటనే బాలికను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పీకపై కుట్లు వేయటంతో పాపకు ప్రాణాప్రాయం తప్పింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై మురళి ఆస్పత్రికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. బాలిక తండ్రి జాన్‌రాజ్ నుంచి వివరాలను సేకరించారు. పోలీసులు బస్టాండ్ వద్ద రక్తపు మరకలతో ఉన్న వ్యక్తిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగదీష్ తండ్రి యాదగిరిని కూడా స్టేషన్‌కు పిలిపించి, వివరాలను సేకరిస్తున్నారు.
 
జగదీష్ పుట్టిన రోజు బుధవారం కాదని, అతని పుట్టిన రోజు సెప్టెంబర్‌లో అని ఆయన తెలిపాడు. ఈ సంఘటన భద్రాచలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు బాలికపై ఎందుకు హత్యాయత్నానికి ప్రయత్నించారనేది తెలియాల్సి ఉంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై మురళి తెలిపారు.

Advertisement
Advertisement