అరెరె.. గిట్లాయె..! | Sakshi
Sakshi News home page

అరెరె.. గిట్లాయె..!

Published Sun, Oct 5 2014 3:39 AM

Gitlaye .. Oh ..!

ఇటీవల కమలాపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. అదేరోజు రాత్రి సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఆ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. శిలాఫలకంలో తమ పేర్లు లేవని.. ఆ కార్యక్రమంలో మంత్రి తమను చిన్నచూపు చూశాడనే ఆరోపణలతో విధ్వంసానికి ఒడిగట్టారు. కమలాపూర్ సర్పంచ్ శనిగరం సమ్మయ్య, వైస్ ఎంపీపీ బైరి దశరథంతో పాటు మరో టీఆర్‌ఎస్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు ఈ ఘటనలో అదుపులోనికి తీసుకున్నారు. మంత్రి సెగ్మెంట్‌లో ఆయన కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసేంత వరకు వెళ్లటం అందరి నోటా చర్చనీయాంశమైంది.

     మరోవైపు హుజూరాబాద్ ప్రాంత చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ హోదా కోసం ఈటెల మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తనవంతుగా పావులు కదిపారు. ఎన్నికల ముందు హుస్నాబాద్‌కు మంజూరైన రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేయించి కొత్త జీవో తెచ్చారు. ఆగస్టు 14న హుజూరాబాద్‌లో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. నెలరోజుల తర్వాత ఈ ఆర్డీవో కార్యాలయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పాత జీవోను అమలు చేయాలని సూచించింది. హుస్నాబాద్‌లో ఆర్డీవో కార్యాలయం కావాలని సొంత పార్టీ ఎమ్మెల్యే సతీష్‌బాబు, ఆయన తండ్రి, పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు పట్టుబడుతున్నారు. హుజూరాబాద్‌కు ఈ హోదా కల్పించాలని ఈటెల కోరుతున్నారు. ఈ వివాదంలో కోర్టు తీర్పు ఈటెలకు షాక్ ఇచ్చింది.

     మరోవైపు హుజూరాబాద్ నగర పంచాయతీ చైర్మన్ నియామకం మంత్రిని చు ట్టుముట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన విజయ్‌కుమార్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టి చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేర్పించటం సొంత పార్టీ కౌన్సిలర్లను అయోమయానికి గురిచేసింది. అక్కడ తొమ్మిది మంది టీఆర్‌ఎస్ కౌన్సిలర్లుగా గెలిచారు. బీసీ జనరల్‌కు కేటాయిం చిన చైర్మన్ సీటుకు నలుగురు కౌన్సిలర్లు పోటీపడ్డారు. ఆ నలుగురిలో సయోధ్య కుదర్చటంలో మంత్రి విఫలమయ్యారు. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరే ఒప్పందంతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఈ సీటును దక్కించుకున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లను కాద ని, వేరే కౌన్సిలర్‌కు మద్దతిచ్చారనే అపవాదు మంత్రిని వెంటాడుతూనే ఉంది.

     పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల రుణమాఫీపై ఈటెల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం లేపాయి. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ అవి అవగాహన లేని మాటలు.. అంటూ వివాదాన్ని తేలిగ్గా కొట్టిపారేయటంతో మంత్రి ఇరుకునపడ్డారు. రాష్ట్ర కేబినేట్‌లో మన జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో ఈటెల రాజేందర్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సీఎం కుమారుడు కావటంతో రాష్ట్రస్థాయి వ్యవహారాల్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో జిల్లాలోని చర్చనీయాంశాలు.. తక్షణ సమస్యలన్నీ మంత్రి ఈటెల వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో సొంత సెగ్మెంట్‌లోనే అసంతృప్తి సెగలు ఆయనకు కంట్లో నలుసులా మారుతున్నాయా.. అనే చర్చలు మొదలయ్యాయి.



 

Advertisement
Advertisement