‘గుడ్‌హార్ట్’ గోల్‌మాల్ | Sakshi
Sakshi News home page

‘గుడ్‌హార్ట్’ గోల్‌మాల్

Published Tue, Mar 11 2014 4:44 AM

goalmal in good heart

 కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ :
 నిరుపేదలు, కూలీలకు ఎల్‌ఐసీలో బీమా పాలసీలు చేయించే పేరుతో కరీంనగర్‌లోని గుడ్‌హార్ట్ అనే స్వచ్ఛంద సంస్థ రూ.కోట్లలో మోసానికి పాల్పడింది. మూడు నెలల క్రితం సంస్థ నిర్వాకం బయటపడడంతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే స్పందించిన సంస్థ నిర్వాహకులు త్వరలోనే ప్రీమియం డబ్బులను ఎల్‌ఐసీకి జమచేస్తామని వివరణ ఇచ్చారు. కానీ ఇంతవరకు గుడ్‌హార్ట్ సంస్థ తమకు డబ్బు చెల్లించలేదని ఎల్‌ఐసీ అధికారులు స్పష్టం చేయడంతో ఏజెంట్లు ఇబ్బందుల్లో పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఏజెంట్లు సోమవారం కరీంనగర్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
 
  తాము ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను గుడ్‌హార్ట్ సంస్థకు చెల్లించామని, ఇప్పుడు డబ్బులు కట్టలేదని ఎల్‌ఐసీ అధికారులు అంటున్నారని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. కిరణ్ అనే ఏజెంట్.. 1400పైగా పాలసీలు చేసి రూ.5లక్షలకు పైగా ప్రీమియం గుడ్‌హార్ట్ సంస్థకు చెల్లించగా, ఆ సంస్థ మాత్రం ఎల్‌ఐసీకి రూ.2లక్షలే జమచేసిందని, మిగతా రూ.3లక్షలను తన జేబులో వేసుకుందని ఆరోపించారు.
 
 మోసం ఇలా..
 పేదలకు సైతం బీమా పాలసీలు ఉండాలనే ఉద్దేశంతో ఎల్‌ఐసీ ఆరేళ్ల క్రితం జీవన్‌మాధుర్, జీవన్‌మంగళ్ అనే రెండు పాలసీలను ప్రకటించింది. వీటికోసం ఎల్‌ఐసీలో మెక్రో ఇన్సూరెన్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. జీవన్‌మాధుర్‌కు వారానికి రూ.25, జీవన్‌మంగళ్‌కు వారానికి రూ.15 చెల్లించి పాలసీ తీసుకోవచ్చు. వీటిని వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వసూలు చేసి సక్రమంగా చెల్లించడానికి ఎన్‌జీవోలకు అవకాశం ఇచ్చింది. వీరు పాలసీల్లో సభ్యులను చేర్చడం, వారి డాటా నమోదు చేయడం, వారు కడుతున్న ప్రీమియం డబ్బులను ప్రతినెల ఐల్‌ఐసీకి జమచేయాలి. ఇలా కరీంనగర్ జిల్లా మొత్తం, వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, భూపాలపల్లి మండలాల్లో పాలసీలు చేయించడానికి కరీంనగర్‌కు చెందిన రహీం అనే వ్యక్తికి చెందిన గుడ్‌హార్ట్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వీరు అయా మండలాల్లో ఫీల్డ్ అఫీసర్లను, ఏజెంట్లను నియమించుకుని పాలసీలు చేయించి ప్రీమియం డబ్బులను ఎల్‌ఐసీకి జమచేయాలి. కరీంనగర్‌లోని గాంధీరోడ్‌లో గల వైశ్యభవన్ ఎదురుగా గుడ్‌హార్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
 
  రెండు జిల్లాలోని  మహిళ సంఘాల సభ్యులను, అంగన్‌వాడీ కార్యకర్తలను, ఆర్‌ఎంపీలు, పీఎంపీలను, రిటైర్డ్ ఉద్యోగులను సుమారు 2వేల మందిని ఏజెంట్లుగా నియమించకున్నారు. వీరిద్వారా రెండు జిల్లాల్లో సుమారు 40వేల మంది ఖాతాదారులను చేర్పించుకున్నారు. మొదటి ప్రతి నెల సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసి ఎల్‌ఐసీకి చెల్లించారు. తర్వాత రెండు సంవత్సరాల నుంచి వసూలు చేసిన డబ్బులను తన జేబులో వేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా రెండేళ్లలో సుమారు 15 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పాలసీదారులు మృతి చెందగా వారికి సంబంధించిన పాలసీ డబ్బుల కోసం కుటుంబసభ్యులు ఎల్‌ఐసీలో సంప్రదించారు. నెలనెలా డబ్బులు కట్టడం లేదని, అందుకే కొన్నేళ్ల క్రితమే పాలసీలను మూసివేశామని ఎల్‌ఐసీ అధికారులు చెప్పడంతో గుడ్‌హార్ట్ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాలసీదారులు ఏజెంట్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి గత పదిహేను రోజులుగా కార్యాలయం మూసి ఉండడంతో.. ఏజెంట్లు ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
 
 ఈ విషయమై ఎల్‌ఐసీ సీనియర్ మేనేజర్ సదానందను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. గుడ్‌హార్ట్ సంస్థపై రూ.6లక్షల గోల్‌మాల్‌కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆ సంస్థకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఇంకా సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement