ముందు చెరువు.. వెనుక దరువు! | Sakshi
Sakshi News home page

ముందు చెరువు.. వెనుక దరువు!

Published Fri, Dec 8 2017 1:38 AM

Goals of Mission Kakatiya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్‌ కాకతీయ లక్ష్యాలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్ప టికే పూర్తి కాని రెండో, మూడో విడతలో 5 వేల చెరువుల పనులను వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నాలుగో విడత కింద మరో ఐదు వేల చెరువులు వారి లక్ష్యంలో చేరాయి. ఉన్న పనులనే ఎలా పూర్తి చేయాలన్న ఒత్తిడిలో ఉంటే, మరో ఐదే వేల చెరువులు కూడా జాబితాలో చేరడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నారు.  

17 వేల చెరువుల పనులు పూర్తి..
రాష్ట్రంలో ఉన్న 46,500లకు పైగా చెరువులను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ కాకతీయ కింద ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 23,233 చెరువులకు పరిపాలనా అనుమతులిచ్చారు. ప్రైవేటు చెరువులు, అటవీ శాఖ పరిధిలోని చెరువులు, భూసేకరణ సమస్యలు, కోర్టు కేసుల్లో ఉన్న చెరువులను పక్కన పెట్టి 22,875 చెరువుల్లోనే పనులు చేపట్టారు. ఇందులో 17 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. మొదటి విడతకు సంబంధించి ఇంకా 38 చెరువుల పనులను పూర్తి చేయాల్సి ఉండగా, రెండో విడతకు సంబంధించి సుమారు 800 చెరువులు, మూడో విడతకు సంబంధించి 4 వేలకు పైగా చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉంది.

మొత్తం 5 వేల చెరువుల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. వర్షాకాలం ముగిశాక మిగిలిన చెరువుల పనుల వేగం పుంజుకున్నాయి. అయినా చాలా చెరువుల్లో నీరు ఉండటంతో వాటిని పునరుద్ధరించేందుకు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జూన్, జూలై వరకు ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చెరువుల పనులను ఎలా పూర్తి చేయాలన్న సమయంలోనే నాలుగో విడతలో 5,073 చెరువులను లక్ష్యంగా పెట్టారు. వీటిని కూడా జూన్‌లో వర్షాలు కురిసే నాటికి సిద్ధం చేసి, ఖరీఫ్‌కు ఆయకట్టు ఇచ్చేలా పనులు ముగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

కొత్తగా చెరువును గుర్తించడం, వాటికి అంచనా వేసి టెండర్లు పిలవడం, పనులు పూర్తి చేయడం ఇప్పుడు చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు పెద్ద సవాల్‌గా మారింది. అంచనాల్లో తప్పిదాలు దొర్లినా, పనుల్లో నాణ్యత లోపించినా ఇంజనీర్ల మీద కత్తి వేలాడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పనులను ఎలా ముగిస్తారు.. కొత్త వాటిని ఎలా చేపడతారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. 

Advertisement
Advertisement