కాళేశ్వరంపై మరిన్ని కొర్రీలు! | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై మరిన్ని కొర్రీలు!

Published Thu, Mar 30 2017 4:31 AM

కాళేశ్వరంపై మరిన్ని కొర్రీలు! - Sakshi

ప్రాజెక్టులోని అనేక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి బోర్డు
సాక్షి, హైదరాబాద్‌:
కాళేశ్వరం ప్రాజెక్టు పాతదేనన్న రాష్ట్ర వైఖరికి భిన్నంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కొత్తదంటూ కేంద్ర జల సంఘానికి చెప్పిన బోర్డు.. ఇప్పుడు మరిన్ని అంశాలపైనా వివాదాలు లేవనెత్తుతోంది. తాజాగా ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) లోని అనేక అంశాల్లో లోపాలున్నాయని అభ్యంతరాలు లేవనెత్తుతూ కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది.

ప్రధానంగా నీటిని గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించడాన్ని ఎత్తి చూపింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పాత నల్లగొండ జిల్లాలో 2.6 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 50వేల ఎకరాలకు నీరందించనున్నారని.. హైదరా బాద్‌ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల మేర కేటాయించారని.. ఇవన్నీ కృష్ణా బేసిన్‌ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఏ నది నుంచైనా కృష్ణా బేసిన్‌కు నీటిని తరలిస్తే బేసి న్‌తో సంబంధమున్న ఏ రాష్ట్రమైనా వాటా కోరే అవకాశం ఉందని, ఆ అంశాన్ని తెలంగాణ డీపీఆర్‌లో ప్రస్తావించలేదని తెలిపింది.

నీటి లెక్కల్లో తేడాలు!
గోదావరిలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 63 టీఎంసీల మేర కేటాయింపులుండగా.. 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించారని, దాని కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉందని సీడబ్ల్యూసీకి బోర్డు వివరించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకుంటున్న 225 టీఎంసీల్లో ఎల్లంపల్లికి మరో 20 టీఎంసీలు చూపారని, వాటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నించింది. ఇక 134.5 టీఎంసీల నీటితో ఖరీఫ్‌లో 18 లక్షల ఎకరాలు, రబీలో 5.5 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని తెలిపారని.. వాస్తవానికి ఇక్కడ నీటి అవసరం చాలా ఎక్కువగా ఉన్నా, ఇలా తక్కువ చూపారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 13,558 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3 చొప్పున రూ.4,067 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారని.. మిగులు విద్యుత్‌ రాష్ట్రం కానప్పుడు ఇంత తక్కువ ధరకు విద్యుత్‌ ఎలా అందుతుందన్న దానిపై పరిశీలన చేయాల్సి ఉందని తెలిపింది. కాగా ఈ అభ్యంతరాలపై కేంద్ర జల సంఘం తిరిగి రాష్ట్రానికి లేఖ రాస్తుంది. తర్వాత రాష్ట్రం వివరణ ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదని, దానికి బోర్డు నుంచి అనుమతులు అక్కర్లేదని ఇదివరకే సీడబ్ల్యూసీకి స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement