ఇంట్లో అందరూ ఉండగానే.. | Sakshi
Sakshi News home page

ఇంట్లో అందరూ ఉండగానే..

Published Fri, Jun 10 2016 11:52 AM

gold robbery in nizamabad district

     న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలో ఘటన
     8 తులాల బంగారం, రెండు కిలోల వెండి
     వస్తువులు అపహరణ


నిజామాబాద్ : తాళం వేసి ఉన్న ఇళ్లలోనే కాదు.. అందరూ ఉండగానే చోరీలకు తెగబడుతున్నారు దొంగలు.. నిజామాబాద్ నగరంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో గురువారం తెల్లవారు జామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగంరంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి న్యూహౌసింగ్‌బోర్డు కాలనీ చివర గల సాయినగర్‌లోని ఓ ఇంట్లో తుకారం అతని కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఇంట్లోని ఆరుగురు బుధవారం రాత్రి హాల్‌లో నిద్రించారు. బెడ్‌రూం కిటీకి తలుపులకు బోల్ట్ పెట్టకుండా దగ్గరకు వేసి ఉంచారు. దొంగలు ఇంటి వెనుక బెడ్‌రూంలో ఎవరూ లేకపోవడంతో కిటికీకి ఉన్న రెండు గ్రిల్స్‌ను తొలగించి ఇంటి వెనుక పారవేశారు. అనంతరం కిటికీలో నుంచి లోనికి ప్రవేశించారు. బెడ్‌రూం తలుపుకు లోపల నుంచి గొళ్లెం పెట్టి, లైట్ వెలుతురు హాల్‌లో పడుకున్న వారికి కనిపించకుండా తలుపుకింద ఉన్న గ్యాప్‌ను దుస్తులతో కవర్ చేశారు.

రెండు బీరువాలను తెరిచి అందులోని 8 తులాల బంగారం, రెండు కిలోల వెండి వస్తువులు, ప్రతి దీపావళికి పూజలు చేసేందుకు దాచి ఉంచిన రూ. 11వేల కొత్తనోట్లు ఎత్తుకెళ్లారు. వేకువజామున ఇంటియజమాని మేల్కొని బెడ్‌రూంలోని బాత్‌రూంలోకి వెళ్లేందుకు డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. అనుమానం ఇంటి వెనుకకు వెళ్లి చూడగా బెడ్‌రూం కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. బెడ్‌రూం తెరిచి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పారవేసి ఉన్నాయి. రెండు బీరువాల్లోని బంగారు, వెండి అభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లడంతో నాల్గో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాల్గో టౌన్ ఎస్సై-3 ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పిల్లల ఫీజులు చెల్లించేందుకు..
తుకారాం తన పిల్లల కళాశాలల ఫీజులు చెల్లించేందుకు బుధవారం రూ. లక్షా 50 వేలు నగదును ఇంటి తీసుకువచ్చాడు. తుకారం తన ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల కొనుగోలు చేసినా వాటిని బిగించలేదు. సీసీ కెమెరాలు ఉంటే చోరీ ఘటనలు అందులో నమోదయ్యేవి.

Advertisement
Advertisement