కలం కబుర్లు... | Sakshi
Sakshi News home page

కలం కబుర్లు...

Published Sun, Nov 16 2014 2:15 AM

gossips

విస్తరణ కోసం వేయి కళ్లతో..
 
 ‘ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమీ...’ ఇది పాత సినిమా పాట కావచ్చు. కానీ, ఇప్పుడు టీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు అచ్చంగా అదే అనుభవాన్ని చవి చూస్తున్నారు. నాలుగు మాసాలుగా మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురుచూస్తూ వారు పాత సినిమాలో ఈ పాటను గుర్తు చేసుకుంటున్నారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై కొందరు ఆమాత్యులుగా వెలిగిపోతుంటే, మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా బుగ్గ కారు యోగం లేకపాయెనే అంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన చెందుతున్నారు. అప్పుడే ఆరు మాసాలు అయిపాయే.. ఆ యోగం మరెప్పుడో అంటూ కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పేరుగాంచిన జ్యోతిష్యుల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. మరికొందరు యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి మనసు పెట్టేదెప్పుడో, వారికి బుగ్గకారు యోగం కలిగేదెప్పుడో...
 
 ధర్నాలు... బైఠాయింపులు... ఎన్నాళ్లీ పాట్లు..
 
 ‘ఎక్కే మెట్లు, దిగే మెట్లు’ ఓ పోస్టుగ్రాడ్యుయేట్ నిరుద్యోగి నిట్టూర్పు అది... మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం కూడా... తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. గన్‌పార్క్ వద్ద ధర్నాలు... అసెంబ్లీ మెట్ల మీద బైఠాయింపులు... ఎన్నాళ్లీ పాట్లు అని కొందరు తెగబాధపడిపోతున్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయి గన్‌పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ ఓ లుక్కేస్తే వినిపించిన నిట్టూర్పులు ఇవి. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నాయట.. ఎటొచ్చి మన పరిస్థితి ఇంతే అని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మథనపడిపోతున్నారు. ఎమ్మెల్యే కూడా కాని తుమ్మలకు మంత్రి పదవి గ్యారంటీ, యాదవ కోటాలో తలసానికి పక్కా అయ్యిందట... ఇక ఓ గ్రేటర్ ఎమ్మెల్యేకు మెడికల్ కాలేజీ పర్మిషన్ అనుకుంటే ఏకంగా హెచ్‌ఎండీఏ పదవి కూడా అంటున్నారు... భవిష్యత్‌ను భలే వెతుక్కుంటున్నారంటూ ఆ ఎమ్మెల్యేలు నిట్టూర్చారు.  
 
 మంత్రయినా అపాయింట్‌మెంట్ మస్టు!
 
 ఏపీ ప్రభుత్వంలో తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్న నేతల హవా కొనసాగుతోంది. ఏ చిన్న పని అయినా చిన్న బాస్ ఎస్ అంటేనే! ఆ చిన్న బాస్‌ను కలవాలంటే పార్టీలో ఎవరికైనా సరే అపాయింట్‌మెంట్ ఉండాల్సిందే. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎవరైనా సరే. తనను కలిసేందుకు ఎవరికీ ఎలాంటి అపాయింట్‌మెంట్ అవసరంలేదని, నేరుగా వచ్చి కలవొచ్చని టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా లోకేశ్ గతంలో ప్రకటించారు. ఇప్పుడది పూర్తిగా రివర్స్ అయింది. ఇటీవల ఒక మహిళా మంత్రి తన పేషీలో పీఏను నియమించుకోవడంలో లోకేశ్ అనుమతి తీసుకునేందుకుగాను అపాయింట్‌మెంట్ కోసం రెండు రోజుల పాటు ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి కలవాలంటే కుదరదని, మరో రెండు రోజులు పోయాక ఫోన్ చేస్తే ఎప్పుడు కలవాలో చెప్తామని సిబ్బంది తేల్చిచెప్పారు. దాంతో మంత్రి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నర్సరావుపేట నేత.. లోకేశ్‌ను కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అపాయింట్‌మెంట్‌లాంటివేవీ లేకుండా నేరుగా సీఎంలను కలిసిన అనుభవంతో ఆయన చిన్న బాస్‌ను కలవడానికి అలాంటి ప్రయత్నమే చేయగా చేదు అనుభవం ఎదురైంది.రెండు గంటలు నిరీక్షించినా చినబాబు నుంచి లోపలకు రమ్మనే పిలుపు రాకపోవడంతో సీనియర్ ఎంపీగారు అసహనం చెందారు. కీలకమైన దేవాలయ పాలక మండలి నియామక విషయంపై చర్చించాలనుకున్న ఆ ఎంపీగారికి ప్రాథమిక అపాయింట్‌మెంట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా వెనుదిరిగారు.
 
 ఎవరి బాధ వారిది..!
 
 ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తుండడంతో పైరవీల కోసం వచ్చిన ఉద్యోగులు, రాజకీయ నేతలతో శనివారం సచివాలయంలో హడావుడి అంతా ఇంతా కాదు. నిన్నా మొన్నటి వరకు బోసిపోయి కనిపించిన సచివాలయం ఒక్కసారిగా కిక్కిరిసింది. ప్రతి మంత్రి చాంబర్ వద్దా పెద్దసంఖ్యలో ఉద్యోగులు, నేతలు గుమిగూడారు. ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో తమ అనుచరులను వెంటబెట్టుకొని మంత్రుల చాంబర్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం తన చాంబర్‌కొచ్చిన పార్టీ నేతలను కలుసుకుంటూనే సాయంత్రమయ్యేసరికి ఎవరికీ చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోయారు. వెళ్లిన ఆయన ఎంతకూ రాలేదు. ఉదయం నుంచీ బదిలీల కోసం మంత్రి దర్శనానికి పడిగాపులు కాస్తున్న నేతలు, కార్యకర్తలు మంత్రిగారెప్పుడొస్తారని పేషీ సిబ్బందిని ప్రశ్నించగా.. ఆయన తన సొంత జిల్లా అధికారుల బదిలీ కోసం జిల్లా ఎమ్మెల్యేలతో కలసి రెవెన్యూ మంత్రి వద్దకు వెళ్లారని తెలిసింది. ‘మీలాగే...! మంత్రిగారికి కూడా ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా. నియోజకవర్గంలోనో, జిల్లాలోనో అధికారుల బదిలీ కోసం ఇతర మంత్రుల వద్దకు వెళ్లకతప్పదు కదా!’ అని అసలు విషయం చెప్పడంతో ఎవరి ప్రాబ్లమ్స్ వారికి అన్న చర్చ మొదలైంది అక్కడ.

Advertisement
Advertisement