కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాల పెంపు

Published Sat, Jun 6 2020 9:10 AM

Government Decided To Hike Incentive For Inter Caste Marriages - Sakshi

ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించడంతోపాటు అంతరాలను చెరిపేయాలనే లక్ష్యంతో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రస్తుత సమాజంలో యువతీ యువకుల కులాంతర వివాహ నిర్ణయానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవడం, ప్రభుత్వం కూడా వీటిని మరింతగా పెంచాలనే ఉద్దేశంతో ప్రోత్సాహక నగదును రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు పెంచింది. దీంతోపాటు ప్రోత్సాహకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.     
– సాక్షిప్రతినిధి, ఖమ్మం

సాక్షి, ఖమ్మం : జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో కులం ఒకటే అయినా శాఖ భేదాలతో పెద్దలు సంబంధాలు కుదుర్చుకునేవారు కాదు. తమ శాఖకు చెందిన వారినే పెళ్లి చేసుకోవాలనే పట్టింపు ఉండేది. మారుతున్న పరిస్థితుల్లో అలాంటి పట్టింపులన్నీ పట్టు విడుస్తున్నాయి. కులం, శాఖ భేదమే లేకుండా యువతీ యువకులు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అభిరుచులు, అభిప్రాయాలు కలిసినట్లయితే పెద్దలను ఒప్పించి మరీ మనువాడుతున్నారు. పెద్దలు కాదన్న పక్షంలో పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకుంటున్నారు. (మీ అమ్మాయి అలాంటి అమ్మాయి..)

రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు..
కులాంతర వివాహం చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు మొదట్లో ఆదరించకపోయినా ఆ తర్వాత దగ్గరకు తీస్తున్నాయి. మరికొన్ని జంటలను దూరంగా పెడుతుండటంతో కుటుంబ పోషణ కొంత భారంగా మారే అవకాశం ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్నజంటలకు నగదు ప్రోత్సాహం అందిస్తూ వస్తోంది. అయితే ఆ ప్రోత్సాహం కల్యాణలక్ష్మి పథకం కన్నా తక్కువగా ఉండటంతో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2011 వరకు కులాంతర వివాహం చేసుకున్న జంటకు ప్రోత్సాహకం రూ.10వేలు ఇచ్చిన ప్రభుత్వం 2012 నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తోంది. (బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!)

ప్రోత్సాహకాలు ఇలా.. 
కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు ప్రభుత్వం అండగా నిలబడి ప్రోత్సాహకాలు అందిస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పూర్తి ఆధారాలనుబట్టి అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాలకు అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. తర్వాత జంటలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. (నాన్నా మళ్లీ వస్తా..)

దరఖాస్తుకు అవసరమైనవి ఇవీ..
► వివాహం చేసుకున్న జంట ఫొటోలు మూడు 
►తహసీల్దార్‌ జారీ చేసిన ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు 
►వయసు ధ్రువీకరణ కోసం విద్యా సంస్థల నుంచి ఇచ్చిన టీసీ, పదో తరగతి మార్కుల మెమో 
►వివాహం చేయించిన అధికారి ద్వారా పొందిన వివాహ ధ్రువీకరణ పత్రం 
►గెజిటెడ్‌ అధికారి ద్వారా పొందిన ఫస్ట్‌ మ్యారేజి సర్టిఫికెట్‌ 
►వివాహం చేసుకున్న జంట కలిపి తీసిన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు 
►వివాహానికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు 
► ఆదాయ ధ్రువీకరణ పత్రం 
► ఆధార్‌ కార్డు 
►రేషన్‌ కార్డు 

ప్రోత్సాహకాలను  పెంచిన ప్రభుత్వం..
కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పెంచింది. గతంలో రూ.50వేల ప్రోత్సాహకం అందిస్తుండగా, రూ.2.50లక్షలకు పెంచుతూ నిర్ణయించింది. కులాంతర వివాహాల ప్రోత్సాహకాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నాం. పెళ్లి చేసుకుని ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటిని పరిశీలిస్తున్నాం. అర్హులైన జంటలను గుర్తించి తక్షణమే ప్రభుత్వానికి నివేదికలు అందించి ప్రోత్సాహకాలు మంజూరయ్యేలా చూస్తున్నాం. జంటలు దరఖాస్తుకు జతపరిచిన బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌కు ఆన్‌లైన్‌ ద్వారా నిధులను జమ చేస్తున్నాం.
– కె.సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు 

Advertisement
Advertisement