రైతు ఆత్మహత్యలు పట్టవా? | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలు పట్టవా?

Published Mon, Sep 7 2015 11:50 PM

రైతు ఆత్మహత్యలు పట్టవా? - Sakshi

- బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
- ప్రజాసమస్యల్ని గాలికొదిలారు..  
- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైర్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చివేతలు, కట్టడాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే.. వాటి గొంతు నొక్కేయడం దారుణమని మండిపడింది. కరువుతో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం హేయమని విమర్శిం చింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుం బాలకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, సుధీర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో వారిని అరెస్టు చేశారు. పలువుర్ని నాంపల్లి స్టేషన్‌కు తరలించిన తర్వాత విడుదల చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు.
 
నియంత పాలన సాగుతోంది: ప్రసాద్‌కుమార్
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ విమర్శించారు. ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ప్రజాప్రతినిధులను అణచివేసేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రజాసమస్యలపై అన్నిపార్టీలతో కలిసి ఉద్యమించి టీఆర్‌ఎస్ మెడలు వంచుతామన్నారు.
 
డిజైన్ మారిస్తే యుద్ధం చేస్తాం : టీఆర్‌ఆర్
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల దాహార్తి తీర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణ హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, బృహత్తర లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం పూటకోమాట మారుస్తోందన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం చేసిన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని, ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిజైన్ మారిస్తే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ధర్నాలో కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి ఉద్దెమర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement