జంపింగ్ జపాంగ్ | Sakshi
Sakshi News home page

జంపింగ్ జపాంగ్

Published Sat, Jun 28 2014 11:49 PM

జంపింగ్ జపాంగ్ - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్:  ఎంపీపీ ఎన్నిక కోసం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే క్యాంప్‌లకు సిద్ధమైన నేతలకు ఎంపీటీసీలు చుక్కలు చూపిస్తున్నారు. ఇన్నాళ్లు తమతో కలిసివున్న ఎంపీటీసీలు చేజారుతుండటంతో పీఠంపై కన్నేసిన ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై కన్నేసిన పార్టీలు ఎంపీటీసీలకు భారీ నజరానాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో టీడీపీ 5, కాంగ్రెస్, రెబల్స్ కలుపుకుని 6 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీ 2, సీపీఎం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఫలితాలు వెలువడింది మొదలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు శిబిరాలు నిర్వహించి ఎంపీటీసీలను దేశ నలుమూలలా విహారయాత్రలకు తిప్పారు. ఎవరూ చేయి జారిపోకుండా తాజాగా రూ.లక్షల్లో బేరసారాలకు దిగుతున్నట్లు తెలిసింది.
 
మధ్యవర్తుల సాయంతో ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మధ్యవర్తికి రూ.15లక్షలు, ఎంపీటీసీకి రూ.40లక్షలు ఆఫర్ చేసినట్లు వినికిడి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీటీసీ టీడీపీ శిబిరానికి చేరువైనట్లు తెలిసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీని ఎలా లాక్కొంటారని ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు శుక్రవారం రాత్రి నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉండే ఓ టీడీపీ నేత ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
 
ఊహించని పరిణామంతో ఖంగుతిన్న టీడీపీ నాయకులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. పరిస్థితి కొట్టుకునేదాకా వెళ్లింది. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోయిన ఎంపీటీసీని రాబట్టుకునే పనిలో కాంగ్రెస్ ఉండగా.. ఆచూకీ తెలియకుండా టీడీపీ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సదరు కాంగ్రెస్ ఎంపీటీసీని ఓటింగ్‌కు హాజరవకుండా చేసి గట్టెక్కేందుకు టీడీపీ ఎత్తుగడ వేస్తుండగా.. ఉన్నవారికి తోడు బీజేపీ, సీపీఎం ఎంపీటీలను తమవైపు తిప్పుకుని ఎలాగైనా ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement