Sakshi News home page

కాసులిస్తేనే కాన్పు..!

Published Wed, May 7 2014 3:34 AM

Government hospitals demanding money with patients

జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ప్యాకేజీల దోపిడీ జరుగుతోంది. కాన్పుకింత... డ్రెస్సింగ్‌కు ఇంత... అంటూ ధరల పట్టికలాగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇవ్వనివారి పట్ల మానవత్వం మరిచిపోయి హీనంగా ప్రవర్తిస్తున్నారు. ప్రసవం కోసం వచ్చే గర్భిణులు ఆస్పత్రిలో అడుగుపెట్టినప్పటినుంచి తిరిగి వెళ్లేవరకూ అడుగడుగునా చేయి తడపాల్సిందే.
 
 కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు మృగ్యమయ్యాయి. గర్భిణులు, బాలింత పట్ల పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. సేవకింత అంటూ డిమాండ్ చేస్తున్నారు. వారడిగినంతా ఇవ్వలేదో... ఇక అంతే సంగతులు. కనీసం పక్కకు కూడా జరపరు. ఏ పనిచేస్తే ఎంతెంత వసూలు చేయాలో డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ధరలు నిర్ణయిస్తున్నారు. గర్భిణీ ఆస్పత్రిలో చేరగానే వివరాలు ఆరా తీస్తూ ఆయాలు మెల్లగా మాటలు కలుపుతారు. మీరు కాస్త చూసుకుంటామంటే(చేయి తడుపుతామంటే) చెప్పండి నేనే అన్నీ దగ్గరుండి చూసుకుంటానంటూ నమ్మబలుకుతారు.
 
 వచ్చినవారు ఓకే అంటే ఈ విషయం డాక్టరమ్మ చెవిలో చేరుతుంది. ముందుగా వైద్యులకు రూ.2 వేలు, నర్సులకు రూ.వెయ్యి, ఆయాలకు రూ.500... ఇలా ప్యాకేజీ వసూలు చేస్తున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోయినా దురుసుగా మాట్లాడుతున్నారు. తాము లేనివారమని, అంత ఇవ్వలేమని అంటే... వారి పని అంతే సంగతులు. ‘అట్లాంటోళ్లు ఇక్కడికెందుకు వచ్చిండ్రు... మా పానాలు తీయడానికి’ అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యురాలు వచ్చాక అన్నీ చూసుకుంటుందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆపరేషన్ అయ్యాక... పక్క జరిపినా... దుస్తులు మార్చినా రూ.100 సమర్పించుకోవాల్సిందే. ఇవ్వని పేషెంట్ల వైపు వారు రానే రారు.

 కాసులిస్తేనే కాన్పు
 ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో గత కలెక్టర్ స్మితా సబర్వాల్ అమ్మలాలన పథకం ప్రవేశపెట్టారు. గర్భిణులను ఆయా ప్రాంతాల వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు ఇక్కడికి తీసుకువస్తున్నారు. ప్రతీరోజు కనీసం పదికి తగ్గకుండా ఆస్పత్రిలో కాన్పులు జరుగుతున్నాయి. నెలలో 300కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. వీరు వసూలు చేస్తున్న ప్యాకేజీల ప్రకారం ఒక్కో డాక్టర్ నెలకు రూ.6 లక్షలు, నర్సులు నెలకు రూ.30 వేలు రోగుల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా... సిబ్బంది పేర్లతో సహా చెబుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
 
 డబ్బులు ఇవ్వనివారి పట్ల సిబ్బంది ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో ఇబ్బందులు పెట్టడం... ఇష్టానుసారంగా కుట్లు వేస్తూ గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆపరేషన్ అనంతరం వేసే కుట్లు చూస్తే ఇది వైద్యమేనా? అనే అనుమానం కలుగుతుంది. గతంలో ఓ మహిళకు సంచి కుట్టినట్టు కుట్లు వేయడంతో ఇన్‌ఫెక్షన్ సోకి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. బంధువులు ఆందోళనకు దిగితే మళ్లీ కుట్లు వేసి పంపించారు. 20 రోజుల క్రితం ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. ఓ మహిళకు కుట్లు వేసి వారం రోజులయినా వార్డులో పట్టించుకోకుండా వదిలేశారు.
 
 కనీసం డ్రెస్సింగ్ కూడా చేయలేదు. ఇష్టానుసారంగా కుట్లు విప్పడంతో అవి పికిలిపోయి బాధితురాలు నరకం అనుభవించింది. రోగి బంధువులు బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు మళ్లీ కుట్లు వేశారు. మరికొందరికి కుట్లు ఎండిపోయి నయం కాకముందే ఇష్టానుసారంగా కుట్లు విప్పడం(కుట్టు లాగడం)తో పికిలిపోయి బాధితులు నరకం చూస్తున్నారు. వైద్యసేవలు అందించి కాపాడాలని బాధితులు, బంధువులు గంటల తరబడి కాళ్లావేళ్లా పడి బతిమిలాడితే విసుక్కుంటూ మళ్లీ థియేటర్‌కు తీసుకెళ్లి కుట్లు వేస్తున్నారు. ఇలా నిత్యం గర్భిణులకు, బాలింతలకు వైద్య సిబ్బంది నరకం చూపిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement