నిజాంసాగర్‌పై మూడు ఎత్తిపోతలు | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌పై మూడు ఎత్తిపోతలు

Published Wed, Oct 2 2019 3:10 AM

The Government Is Planning To Implement Two Lifting Schemes On NizamSagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజాంసాగర్‌ నుంచి జలాలు శ్రీరాంసాగర్‌కు వెళ్లే దారిపై సాగర్‌ ప్రధాన కాల్వలపై రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో ఒకటి మంజీరా ఎత్తిపోతలను చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలపగా, కొత్తగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల పరధిలో జకోరా, చండూరు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రతిపాదించింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ప్రణాళికను రూపొందించాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు.

నిజాం సాగర్, సింగూరు జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీళ్లు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. గుత్ప, అలీ సాగర్‌ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందివ్వాలని సూచించారు. దీనికి వెంటనే సర్వే చేసి, లిఫ్టులు ఎక్కడెక్కడ పెట్టాలి.. వాటి ద్వారా ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

దీనికనుగుణంగా అధికారులు బాన్సు వాడలో నిజాం సాగర్‌ ప్రధాన కాల్వపై రెండు ఎత్తిపోతలు ప్రతిపాదించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. జకోరా ఎత్తిపోతలతో రూ.4,200 ఎకరాలు, చండూర్‌ ఎత్తిపోతలతో 2,850 ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే నిజాంసాగర్‌ దిగువన మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం సాగర్‌ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

Advertisement
Advertisement