నిరుద్యోగులకు భరోసా కల్పించాలి: జస్టిస్ చంద్రకుమార్ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు భరోసా కల్పించాలి: జస్టిస్ చంద్రకుమార్

Published Fri, Mar 13 2015 11:50 PM

నిరుద్యోగులకు భరోసా కల్పించాలి: జస్టిస్ చంద్రకుమార్

బషీర్‌బాగ్: కోటి ఆశలతో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పనకు సమగ్రమైన యువజన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యవసాయరంగం నిస్సహాయ స్థితిలో ఉన్న కారణంగా, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. విద్య, వైద్య, విద్యుత్ రంగాల్లో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు.

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనం లేకుండా వేల ఎకరాలు సెజ్‌లకు ఇచ్చిన ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు లేవని, యూనివర్సిటీల్లో సౌకర్యాలు కరువయ్యాయన్నారు. నిరుద్యోగిత కారణంగా యువత పెడతోవ పడుతున్నారన్నారు. బహుళజాతి పరిశ్రమల్లో ఉద్యోగ వనరులు చూపిన వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సూచించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఉపాధి కల్పనను నిర్లక్ష్యం చేశాయని, పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ను నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గురజాల రవీందర్, మల్లేపల్లి లక్ష్మయ్య, తిప్పర్తి యాదయ్య, డాక్టర్ చీమ శ్రీనువాసరావు, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement