Sakshi News home page

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: వైఎస్ షర్మిల

Published Fri, Dec 12 2014 5:28 PM

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: వైఎస్ షర్మిల - Sakshi

మహబూబ్నగర్: సకాలంలో వర్షాలు రాకపోవడం, మద్దతు ధర లేకపోవడం, విద్యుత్ సమస్యల వల్ల రైతులు కష్టాలు పడుతున్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ  వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నష్టపో్యిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం ఐదోరోజుకు చేరుకుంది.

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని షర్మిల అన్నారు. పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను ఈ రో్జు  షర్మిల పరామర్శించారు.  పెద్ద ఎల్కచర్లలో  ఎస్. కృష్ణమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.  ఆ కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కిష్టమ్మ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు.

తన తల్లి కిష్టమ్మకు రాజశేఖరరెడ్డి అంటే అపారమైన గౌరవమని, తనకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడని తన తల్లి ఎంతో సంతోషించేదని కిష్టమ్మ కుమారుడు బాలయ్య ఈ సందర్బంగా షర్మిలకు వివరించాడు. వైఎస్ మరణవార్త విని తన తల్లి గుండెపోటుతో చనిపోయిందని బాలయ్య ఆవేదన చెందాడు. ఆ మహానేత కుమార్తె తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement