గిరిజనులను ఆదుకోని ప్రభుత్వాలు | Sakshi
Sakshi News home page

గిరిజనులను ఆదుకోని ప్రభుత్వాలు

Published Mon, Apr 18 2016 10:43 AM

governments ignore tribal problems

అచ్చంపేట : దేశంలో ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వమూ గిరిజనులను ఆ దుకోలేదనిత్రిపుర ఎంపీజతిన్‌చౌదరి అన్నారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట కుమారస్వామిరైస్ మిల్లు ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభ, గిరిజన సంస్కాృతిక సంబరాల బహిరంగ సభ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 90శాతం గిరిజనుల్లో 5వేల అల్పాదాయ కుటుంబాలు ఉన్నాయని ఓ సర్వే ద్వారా తెలుస్తోందని చెప్పారు. అయినా వీరి గురించి పట్టించుకునే వారు లేరన్నారు. దేశాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి ఎలా ఉండాలన్నది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చారని,  ఆ విధంగా అమలు కావడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆదాయ నిష్పత్తి ప్రకారం 8.6శాతం ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.47లక్షల36వేల కోట్లు కేటాయించాల్సి ఉంటే, ఆర్థిక మంత్రి కేవలం రూ.26లక్షల 50కోట్లు కేటాయించారని అన్నారు. సగం బడ్టెట్ ఇస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 16.5 శాతం ఉన్న ఎస్సీలకు కూడా సగం బడ్జెట్ మాత్రమే కేటాయిస్తున్నారని అన్నారు. ఎస్టీల విద్య కోసం ప్రభుత్వం రూ.8వేల 97కోట్లు కేటాయిస్తే అందులో 60శాతం భవనాలకు, 30శాతం ఉపాధ్యాయులకు, 8శాతం విద్యార్థుల కోసం ఖర్చుపెడుతుందని తెలిపారు. విద్యాపరంగా ఎస్టీలు పైకిరాకుండా జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం గిరిజనుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 అటవీహక్కుల చట్టం అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదని మాజీఎంపీ, ఎఎఆర్‌ఎం కార్యదర్శి మిడియం బాబూరావు విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో మొదట10వేల కుటుంబాలకు భూమిపై హక్కు కల్పిస్తామని చెప్పి తర్వాత 8వేలకు కుదించారని, ఇచ్చింది కేవలం 3వేల మందికే అని అన్నారు. అటవీప్రాంతంలో ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నారని చెప్తూనే అటవీశాఖ కొర్రీలు పెడుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి 10ఎకరాల భూమి ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు. సాగుచేసుకుంటున్న భూమిలో చెట్లు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని, దీని విరమించుకోవాలంటూ అటవీశాఖ అనవసరంగా కేసులు పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుపై శాసనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదన్నారు. అభయారణ్యంపై ఆధారపడి జీవించే వారికి భూమి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, తెలంగాణలో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 23 గ్రామాలు షెడ్యూల్డు ప్రాంతంలో ఉన్నాయని ఇక్కడ సాగుచేసుకొనే వారికి భూమి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 23లక్షల ఎకరాల భూమి ఇస్తామని కేవలం 3వేల ఎకరాలు ఇచ్చారని, అటవీ భూముల్లో నీళ్లు, కరెంటు ఇచ్చి రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు.

ఎస్‌ఎల్‌బీసీలో నష్టపోయిన 9గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి ప్రాజెక్టులో కోల్పయిన వారికి భూమితో పాటు ఇంటి నిర్మాణంకు రూ.5లక్షలు, ఉద్యోగం, 20ఏళ్ల పాటు 2వేల ఫించన్ విధానం అమలు చేయాలని కోరారు. పాలమూరు ప్రాజెక్టు కింద 20గ్రామాలు నిర్వాసితులవుతున్నారని, వారికి కొత్త చట్టం ప్రకారం పరిహారం కల్పించాలని కోరారు. సీఎం వద్ద ఉన్న టీఎస్‌ఏ చైర్మన్ పదవి గిరిజన ఎమ్మెల్యే కేటాయిస్తే సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. సభ అనంతరం ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ శోభన్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మనాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.దేశ్యానాయక్, రాష్ట్ర నాయకులు పి.రఘనాయక్, సోమయ్యనాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఎస్.బీచ్చానాయక్, శంకర్‌నాయక్, దశరథంనాయక్, రాములునాయక్, పూజారి పురుషోత్తం పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement