ఆనాడే తుపాకీ పట్టేవాడిని | Sakshi
Sakshi News home page

ఆనాడే తుపాకీ పట్టేవాడిని

Published Sun, Jul 29 2018 2:23 AM

Governor Narasimhan VIsits 16th Convocation Of Nalsar University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అసోంలో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నా సోదరుడిని ఆఫీసులోనే బాంబు పేల్చి పొట్టనబెట్టుకున్నారు. నాకు ధైర్యం ఉండి ఉంటే అప్పుడే తుపాకీ పట్టేవాడిని. అదే జరిగి ఉంటే ఉగ్రవాదినని నా కోసం పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసు ఇచ్చి ఉండేవారు’అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తన సోదరుడి హత్య కేసును సీబీఐ, కోర్టులు దర్యాప్తు చేసినా నిందితులందరూ శిక్ష పడకుండానే తప్పించుకున్నారని, ఇలాంటి సందర్భాల్లోనే న్యాయం లభించినట్లు కనబడాలని, సత్వర తీర్పుల ద్వారా న్యాయం గెలిచిందనే భావన ప్రజలకు తెలియాలని చెప్పారు. సమాజ శ్రేయస్సులో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర అన్నారు. శనివారం హైదరాబాద్‌ శివారులోని షామీర్‌పేట నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్వర న్యాయం లభించడం లేదని చాలా మంది విమర్శిస్తుంటారని, వాస్తవానికి కోర్టుల్లో పని భారం ఎక్కువగా ఉందని చెప్పారు. ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు చేయదలిస్తే.. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కొన్ని నిర్ణయాల వల్ల కొద్ది మంది నష్టపోవచ్చని, కానీ ఇలాంటి సందర్భాల్లో విస్తృత సమాజ శ్రేయస్సు ముఖ్యమన్నారు. 

రాజ్యాంగానికి రక్షణ కవచం న్యాయ వ్యవస్థ 
లా పట్టాలు పొంది బయటకు వెళుతున్న విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయని.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని గవర్నర్‌ సూచించారు. దేశ ప్రధాని (ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించలేదు) హత్య జరిగినపుడు నిందితుల తరఫున ఎందుకు వాదించాలని ప్రశ్నించే వారుంటారని, వారి వాదన చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని అన్నారు. ‘డబ్బున్న నిందితుడికి గుండెపోటు వస్తే ఆస్పత్రిలో చేరుస్తారని, పేదవాడికి జైలులోనే వైద్యం చేస్తారని, కొన్ని కేసుల్లో మీడియా చూపించే వార్తలు న్యాయ విచారణపై ప్రభావం చూపుతున్నాయని, ఇలా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ఎంతో మంది ప్రశ్నలు వేస్తారు. కానీ క్షేత్ర స్థాయిలో నిజానిజాలు బేరీజు వేసుకుని నైతిక విలువలకు కట్టుబడి పని చేయాలి’అని విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉందని.. అది దెబ్బతింటే అరాచకాలు, అన్యాయాలు పెరిగిపోతాయన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చివరికి కోర్టుల దగ్గరకే వస్తారని, అలాంటి న్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోయే విద్యార్థులంతా నిత్య అధ్యయనం చేస్తూ ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు.

బంగారు పతకాల పంట
కార్యక్రమంలో 409 మంది విద్యార్థులకు వివిధ న్యాయ శాస్త్ర పట్టాలను ప్రదానం చేశారు. 49 బంగారు పతకాలను ప్రదానం చేయగా ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని తన్వీ తహిన 11.. కరణ్‌ గుప్తా, శుభ్రా త్రిపాఠి 6 చొప్పున అందుకున్నారు.

దేశంలో 5వ స్థానంలో నల్సార్‌ 
దేశంలోని నాలుగు వందల వర్సిటీల్లో నల్సార్‌కు 5వ స్థానం లభించిందని నల్సార్‌ వైస్‌ చాన్స్‌లర్‌ పైజన్‌ ముస్తఫా చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసేటపుడు నల్సార్‌ తమ వంతు సహకారం అందిస్తోందని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై భారత ఎన్నికల సంఘంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. నల్సార్‌ వర్సిటీ చాన్స్‌లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయ కోవిదుడు ప్రొఫెసర్‌ ఉపేంద్ర భక్షికి కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. భక్షి మాట్లాడుతూ.. జీవించే హక్కు గురించి రాజ్యాంగంలో చిన్నగా ఉన్నా కోర్టులు విశాల భావజాలంతో తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. పర్యావరణ హితంగా సాగిన జీవనం.. ఇప్పుడు మనిషి మాత్రమే ముఖ్యమనే ధోరణిలో సాగుతోందని, రానున్న కాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో పర్యావరణం ఒకటని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఎస్‌ఎం ఖాద్రి, జస్టిస్‌ పి.వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement