‘గ్రేటర్’ మార్పులు | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ మార్పులు

Published Sat, Oct 11 2014 4:05 AM

‘గ్రేటర్’ మార్పులు

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దీంతో నగరంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యూష్‌సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల తుది జాబితా శుక్రవారం విడుదలైంది.

గ్రేటర్‌లో ముఖ్య విభాగాల  బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషన ర్లు అహ్మద్‌బాబు, ప్రద్యుమ్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో కొత్త అధికారులు రానున్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను  అక్కడి నుంచి ఇప్పటికే బదిలీ చేయడంతో ఆ స్థానానికీ కొత్త అధికారి రానున్నారు.

గత జాబితాలోనే వీరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించి నప్పటికీ, తుది జాబితాలో మార్పుచేర్పులకు అవకాశముంటుం దనే అభిప్రాయాలు వెలువడ్డాయి. మెట్రోపొలిస్ సదస్సు ముగింపు రోజే  తుది జాబితా వెలువడటం యాధృచ్ఛికమే అయినా, జీహెచ్‌ఎంసీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. తుదిజాబితాలో సోమేశ్‌కుమార్‌ను  తెలంగాణకే  కేటాయిస్తారని.. కాదు  ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారని పందేలు కూడా జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు.. సమగ్ర కుటుంబ సర్వే.. బతుకమ్మ ఉత్సవాలు.. మెట్రోపొలిస్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సోమేశ్‌కుమార్ ముఖ్యభూమిక పోషించారు.

మెట్రోపొలిస్  నిర్వహణలో, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంలో  అహ్మద్‌బాబు   ఎంతోకృషి చేశారు. పనితీరుతోనే కాక, వ్యవహార తీరుతోనూ సోమేశ్‌కుమార్ వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పలువురికి కంటగింపుగామారినప్పటికీ తనదైన శైలిలో ముందుకు సాగారు.  గత ఏడాది అక్టోబర్ 23న సోమేశ్‌కుమార్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నప్పటికీ తొలిజాబితాలో  ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

తుది  జాబితాలో మార్పులు జరగవచ్చుననే అభిప్రాయాలు వెలువడ్డాయి. స్పెషల్ కమిషనర్లు అహ్మద్‌బాబు, ప్రద్యుమ్నలు కొద్దినెలల కిందటే జీహెచ్‌ఎంసీకి బదిలీపై వచ్చారు. వీరిస్థానంలోనూ కొత్త అధికారులు రానున్నారు. తొలిజాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపు జరిగిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా సైతం తుదిజాబితాలోనూ అక్కడకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాబోయే అధికారుల కనుగుణంగా ఆయా విభాగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement