భూగర్భ క‘న్నీరు’ | Sakshi
Sakshi News home page

భూగర్భ క‘న్నీరు’

Published Fri, Oct 10 2014 2:57 AM

భూగర్భ క‘న్నీరు’

భూగర్భ జలం జిల్లాలో రోజురోజుకూ అడుగంటిపోతుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అప్పుడే సాగు నీటికష్టాలు మొదలయ్యాయి. జిల్లాలోనే అత్యధికంగా ఎంపీ బంజరలో 6.33 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. సరైన వర్షాలు పడకపోతే రబీలో మెట్ట ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి తప్పదు. గత ఏడాదితో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా సగటున ఈసారి 0.69 మీటర్ల లోతులోకి జలాలు అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది.        

సాక్షి, ఖమ్మం: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షపాతం లోటు ఉంది. వర్షాధారంగా సాగు చేసిన పం టలు ఇప్పటికే ఎండిపోతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు కూడా అడుగంటాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతంలో ఇంకా 133.4 మి.మీటర్ల లోటు ఉంది. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గడానికి కారణం సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడమే. నైరుతి రుతు పవన ప్రారంభ నెల జూన్‌లో అత్యధికంగా 77.5 మి.మీ, ఆగస్టులో 32.8 మి.మీ లోటు ఏర్పడడం ఆ తర్వాత తగినంతగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి.

నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతానికి కీలకమైన ఈ రెండు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఈశాన్య రుతుపవనాల ఆశ ఉన్నా .. నైరుతి రుతుపవన కాలం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. భూగర్భ జలాలు తగ్గితే వర్షాధారంగా సాగు చేసిన పంటలు ఎండిపోవడం, బోర్లు, బావుల కింద విద్యుత్ మోటార్లతో సాగు చేస్తున్న పంటలకు నీరందడం కష్టమే. పరిస్థితి ఇలానే ఉంటే రబీ నాటికి జిల్లా వ్యాప్తంగా సగటున రెండు మీటర్ల వరకు నీటి మట్టం పడిపోయే అవకాశం ఉంది.
 
ప్రమాద ఘంటికలు
భూగర్భ జలవనరులశాఖ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్‌లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోతే అంతగా పంటలు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీలో మరింత తీవ్రతరమై నీటి కష్టాలు రానున్నాయి. వేసవిలో ప్రజలు నీటికోసం అల్లాడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో తిరుమలాయపాలెం మండలంలో ఎక్కువగా బోర్లు, బావుల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఇక్కడ తోటలు, ఇతర పంటల సాగుకు రైతులు ఎక్కువగా బోర్లు, బావుల మీదనే ఆధారపడుతున్నారు.

మండల మొత్తం మీద 103 శాతం నీటిని వాడుతున్నారు. ఆ తర్వాత కూసుమంచి, దమ్మపేట మండలాల్లో ఎక్కువ నీరు వినియోగిస్తున్నారు. కూసుమంచి మండలంలో భూగర్భ జలాలు పడిపోతున్నా.. దమ్మపేట, తిరుమలాయపాలెం మండలాల్లో మాత్రం ఒకింత ఆశాజనకంగా నీరు ఉన్నట్లు భూగర్భ జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ మండలాల్లో గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో 1.38 మీటర్ల పైనే భూగర్భ జలం ఉంది. నేలస్వభావం, చెక్‌డ్యామ్‌లలో నిల్వ ఉన్న వర్షపునీరు భూమిలోకి ఇంకడంతో నీటివాడకం ఎక్కువగా ఉన్నా ఇక్కడ భూగర్భ జలమట్టం పడిపోలేదు.

వాల్టా..ఉల్టా..
భూగర్భ జలవనరులను పరిరక్షించడానికి వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్టు) చట్టం ప్రధానమైనది. భూగర్భ జలవనరుల శాఖ అనుమతి లేకుండా ఎక్కడైనా ఇసుక తవ్వినా, బోర్లు, బావులు తీసినా కేసులు నమోదు చేస్తారు. అయితే గ్రామాల్లో వాల్టా చట్టాన్ని అతిక్రమించి వేల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. వాగులు, వంకల్లో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పొక్లెయిన్లతో ఇసుకను భారీ ఎత్తున తీస్తున్నారు. వాగులు, వంకలు తీరప్రాంతాల్లో భూగర్భ జలం పడిపోతుంది. వర్షాభావ పరిస్థితులతో మరింతగా నీరు లోపలికి వెళ్లడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటే కొంత మేరకైనా భూగర్భ జలమట్టం పడిపోకుండా చూడవచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement