ఉచిత విద్యుత్ వద్దని రాసివ్వాలి..! | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్ వద్దని రాసివ్వాలి..!

Published Fri, Dec 26 2014 2:31 AM

ఉచిత విద్యుత్ వద్దని రాసివ్వాలి..! - Sakshi

* సోలార్ పంపుసెట్ల మంజూరుకు విద్యుత్ శాఖ మెలిక
* సోలార్ పంపు సెట్లు తీసుకోవాలంటూ రైతులపై అధికారుల ఒత్తిడి
* ఇక ఉచిత విద్యుత్ కోరబోమంటూ హామీ పత్రం ఇవ్వాలంటూ షరతు
* రైతుల్లో సంశయం.. సోలార్‌పంపు సెట్లు తీసుకోవాడానికి వెనుకంజ
* ఖరీఫ్ కల్లా 6 లక్షల పంపుసెట్లు బిగించాలని అధికారులపై ఒత్తిడి
* లేదంటే కేంద్రం ఇచ్చే నిధులు మురిగిపోతాయని సర్కారు తొందర
* సోలార్ సెట్లతో ఉచిత విద్యుత్ భారం సగం తగ్గుతుందనే యోచన
* 8,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో రూ. 4,000 కోట్ల ఆదా అంచనా
* ప్రయోగాత్మకంగా పరిశీలించకుండా అంటగట్టడం సరికాదంటున్న రైతు సంఘాలు

 
 సాక్షి, హైదరాబాద్: సోలార్ పంపుసెట్లు కావాలా? అయితే మీరు ఉచిత విద్యుత్ పథకం నుంచి తప్పుకోవాలి! శాశ్వతంగా సౌర వినియోగంపైనే ఆధారపడాలి. దీనికి కట్టుబడి ఉన్నామని ముందే హామీ పత్రం రాసివ్వాలి. ఆ తర్వాత సాంకేతిక లోపం వచ్చినా.. ఇతరత్రా సమస్యలొచ్చినా మళ్ళీ ఉచిత విద్యుత్ కోరబోమని స్పష్టం చేయాలి. విద్యుత్ శాఖ పెట్టే కొత్త మెలిక ఇది! వీలైనంత త్వరగా రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ పంపుసెట్లను సౌర విద్యుత్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల భారీగా విద్యుత్ ఆదా అవుతుందని సర్కారు భావిస్తోంది. అయితే ముందే హామీ పత్రాలు ఇచ్చేందుకు రైతులు సంశయిస్తున్నారు.
 
 ఇబ్బందులు ఎదురయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సోలార్ పంపుసెట్లకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. సాధ్యమైనంత వరకూ రైతులను ఒప్పించి, సోలార్ పంపుసెట్లు అమర్చాలని ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. మొత్తం మీద వచ్చే ఖరీఫ్ నాటికి మొత్తం 6 లక్షల సోలార్ పంపుసెట్లను అమర్చాలని సంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదన సంస్థ (నెడ్‌క్యాప్) కంకణం కట్టుకుంది. తొలుత కొత్త కనెక్షన్లకే సోలార్ పంపుసెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆశించిన మేర రైతులు ఆసక్తి కనబరచడం లేదు. 13 జిల్లాల్లో ఇప్పటికే 2.5 లక్షల మంది కొత్త కనెక్షన్ల కోసం వేచి చూస్తున్నారు. వీళ్ళంతా అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్నారని పంపిణీ సంస్థలు చెప్తున్నాయి.
 
 8 వేల మిలియన్ యూనిట్ల పొదుపు అంచనా...
 రాష్ట్రంలో 8,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. దీనివల్ల రూ. 4,000 కోట్లు ఆదా చేయవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు అధికారికంగా ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ వినియోగం ఏటా 11,000 మిలియన్ యూనిట్ల వరకూ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు ఏడు గంటలు పంపుసెట్లకు విద్యుత్ ఇచ్చినా.. ఈ మొత్తం 8,000 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం లేదు. మిగిలిన 3,000 మిలియన్ యూనిట్లు అనధికారికంగా వాడుతున్న పంపుసెట్ల వల్ల ఖర్చవుతోందని భావిస్తున్నారు. మీటర్లు, చిప్‌లను అమర్చడం ద్వారా ఈ విద్యుత్‌ను ఆదా చేయవచ్చనేది పంపిణీ సంస్థల యోచన. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకూ 6 లక్షల సోలార్ పంపుసెట్లు మంజూరయ్యాయి. వీటిని వినియోగంలోకి తెస్తే, దాదాపు 4,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. దీంతో వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్‌లో 7,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని భావిస్తున్నారు.
 
 ఉచిత విద్యుత్‌కు దశల వారీగా మరిన్ని కోతలు...
 దీన్ని ఏడాదిలో అమలు చేస్తే, ఉచితంగా ఇచ్చే విద్యుత్ కేవలం ఏటా 4,000 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంటుంది. వీటిని కూడా దశల వారీగా తగ్గించడం సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. తొలి దశలో మీటర్లు అమర్చడం, ఆ తర్వాత ఉచిత విద్యుత్‌ను పరిమిత యూనిట్లకే కుదించడం తదుపరి అంకాలుగా అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని చెప్తున్న ప్రభుత్వం.. కొనుగోలు విద్యుత్‌కు రోజుకు రూ. 11.5 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు స్పష్టం చేసింది. పీక్ అవర్స్‌లో యూనిట్ 6 రూపాయల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఈ కొనుగోలు విద్యుత్‌ను, సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కలుపుకుంటే, యూనిట్‌కు దాదాపు రూ. 5 వరకూ ఖర్చవుతోంది. ఇందులో రాబడి తీసేస్తే యూనిట్‌కు 1.75 వరకూ నష్టం వస్తోంది. నష్టపోయే విద్యుత్ మొత్తం వ్యవసాయ విద్యుత్‌ను తగ్గించడం ద్వారా పూడ్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు.
 
 నిధులు మురిగిపోతే కేంద్రానికి సంజాయిషీ ఇవ్వాలి...
 సోలార్ పంపుసెట్ల కోసం అధికారులు ఊరూ వాడా తిరిగినా రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఈ కసరత్తు చేశారు. పంపిణీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి తేవడంతో సోలార్ పంపుసెట్లు తీసుకోవాలని విద్యుత్ సిబ్బంది బలవంతం చేస్తున్నారు. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంజూరు చేసిన సోలార్ పంపుసెట్ల నిధులు ఏడాదిలోగా ఖర్చు పెట్టాలి. నిధులు మురిగిపోతే సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని నెడ్‌క్యాప్ ఆందోళన చెందుతోంది. నిరంతర విద్యుత్ సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా సోలార్ పంపుసెట్లు అమర్చడంలో ముందుకెళ్ళలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టుగా కేంద్రం భావించే ప్రమాదం ఉంది.
 
 ఈ కారణంగా రైతులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారని క్షేత్రస్థాయి నివేదికలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సోలార్ పంపుసెట్ల వినియోగంపై ఎలాంటి ప్రయోగాత్మక ఫలితాన్ని చూపకుండానే అంటగట్టడం సరికాదని రైతు సంఘాలు అంటున్నాయి. ప్రైవేటుగా అమర్చిన సోలార్ పంపుసెట్లు 100 అడుగులకు మించి నీరు పైకి తేలేకపోతున్నాయని వారు చెప్తున్నారు. గుజరాత్‌లో విజయవంతమైనట్టు ప్రభుత్వం చెప్తున్నా.. రైతు సంఘాలను అక్కడికి తీసుకెళ్లి చూపించలేదని, వాస్తవాలు ఎలా తెలుస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement