ఎన్నికల హామీలు అమలు చేయాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలు అమలు చేయాలి

Published Mon, Dec 15 2014 2:18 AM

ఎన్నికల హామీలు అమలు చేయాలి - Sakshi

  • వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
  • మణుగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మణుగూరు, పినపాక మండలాల్లో పర్యటించి విద్యుత్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు.

    ఆ తర్వాత మణుగూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, వాటివల్ల నష్టపోతున్న ప్రజలకు, రైతులకు సరైన న్యాయం చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు. అభివృద్ధి పేరుతో పవర్ ప్రాజెక్టులు నిర్మించి పేదల నెత్తిన  బూడిద పోస్తే సహించేది లేదని హెచ్చరించారు. భూముల రకాన్ని బట్టి పరిహారం చెల్లించాలని కోరారు.

    ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులవుతున్న వ్యవసాయ కూలీలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని సక్రమంగా అమలు చే యాలని డిమాండ్ చేశారు. పత్తి, వరి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసి, ఎలాంటి షరతులు లేకుండా క్వింటాకు రూ.4,500 చెల్లించాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న వేతనాలను సింగరేణిలో కూడా ఇవ్వాలన్నారు.

    ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన పింఛన్లు అందరికీ అందేలా చూడాలని అన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, కొదమసింహం పాండురంగాచార్యులు తదితరులు ఉన్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement