ఇదీ గురుకుల్ నేపథ్యం... | Sakshi
Sakshi News home page

ఇదీ గురుకుల్ నేపథ్యం...

Published Tue, Jun 24 2014 2:24 AM

gurukula schools episode

ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం నలుగుతోంది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఖానామెట్, ఇజ్జత్‌నగర్ ప్రాంతాల్లోని 627 ఎకరాల గురుకుల్ ట్రస్టు భూముల విషయంలో జనంలో భయం గూడుకట్టుకున్నా.. అక్కడ అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ఇక్కడ ప్లాట్లున్న వారంతా ఏదో ఒక రకంగా ‘పెద్దల’ అండదండలున్న వారు కావడంతో అధికారులు, సర్కారీ హెచ్చరికలు తాత్కాలికంగానే పనిచేస్తున్నాయి. కొంతకాలం మిన్నకుండి తిరిగి అక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి.
 
 గురుకుల్ ఘట్‌కేసర్ ట్రస్ట్‌కు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌లలో 627 ఎకరాల భూమి ఉంది. మేనేజింగ్ ట్రస్టీ కిషన్‌లాల్ ట్రస్ట్ భూమిని సత్యనారాయణ అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారు.
 
 సత్యనారాయణ 1980 నుంచి ఎకరాల కొద్దీ భూమిని విక్రయించారు. పలు సంస్థలు, సొసైటీలతో పాటు పలువురు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో 1,200 మంది శ్రీస్వామి అయ్యప్ప కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా ఏర్పడి గురుకుల్ ట్రస్టుకు చెందిన 110 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా చేశారు. వీటిలో 80 శాతం స్థలాల్లో భవనాలు వెలిశాయి. అనుమతులు లేకపోయినా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. ట్రస్టు భూముల్లో ప్రస్తుతం అయ్యప్ప సొసైటీతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, బృందావన్ కాలనీ, భాగ్యనగర్ సొసైటీ, విఘ్నేశ్వర్ కాలనీ తదితర లేవుట్‌లు ఉన్నాయి.
 
 అయ్యప్ప సొసైటీకి సర్వే నెంబరు 140లో 1215 ప్లాట్లు, మరో లేఔట్‌లో వేర్వేరు సర్వే నెంబర్లలో వెయ్యికిపైగా ప్లాట్లున్నాయి.
 
 2002లో ఈ అక్రమ విక్రయాల్ని గుర్తించిన ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ట్రస్ట్‌కు చెందిన  భూముల అమ్మకాలు చెల్లవని స్పష్టం చేసింది.
 
 దీంతో భూములు కొన్న వారిలో కొందరు కోర్టుకు వెళ్లారు. అయితే ఆ అమ్మకాలు చెల్లవని, కొనుగోలు చేసిన వారి పత్రాలకు విలువ లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి నిర్మాణాలు జరగకుండా ఆ భూములపై స్టేటస్‌కో ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో దేవాదాయ శాఖకు తగిన విధంగా సహకరించాల్సిందిగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు సూచించింది.
 
 ప్లాట్లు కొనుగోలు చేసిన వారి విజ్ఞప్తులతో 2006లో ఈ అంశంపై సమీక్ష జరిపిన అప్పటి ప్రభుత్వం.. అయ్యప్ప సొసైటీలోని నిర్మాణాల కూల్చివేతను నిలిపివేసింది. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కూడా హెచ్చరించింది. ఇందుకోసం సొసైటీలోకి భవన నిర్మాణ సామాగ్రి రాకుండా నిషేధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. అయితే అది సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు. అనంతర కాలంలోనూ యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. వీటిని గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు 2007 ఏప్రిల్‌లో కూల్చివేతలు జరిపారు. దీంతో తమ భవనాల్ని క్రమబద్ధీకరించేంత వరకు ఎలాంటి అదనపు నిర్మాణాలు జరపబోమని బాధితులు స్థానిక మునిసిపల్ అధికారులకు అండర్‌టేకింగ్ ఇచ్చారు.
 
 ఇంత జరిగినా అదనపు నిర్మాణాలు, అక్రమాలు ఆగలేదు. తిరిగి 2011 ఆగస్టులో అప్పటి కమిషనర్ కృష్ణబాబు భారీఎత్తున కూల్చివేతలు జరిపారు. అప్పట్లో 88 భవనాలను కూల్చివేశారు. అనంతరం జే ఎన్‌టీయూ ఆర్కిటెక్ట్ విద్యార్థులతో సొసైటీలో సర్వే జరిపించారు. మొత్తం 1210 భవనాలున్నట్లు గుర్తించారు. ఇకపై అక్రమ నిర్మాణాలు రాకుండా చూస్తామని, అదనపు అంతస్తులు వెలియకుండా ఎప్పటికప్పుడు నిఘాతో పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. కొద్దిరోజుల పాటు సాగిన ఆ ప్రక్రియ తర్వాత ఆగిపోయింది. మళ్లీ అక్రమ అంతస్తులు వెలిశాయి. కూల్చిన భవనాలు మళ్లీ లేచాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి సమీక్షలోనే ట్రస్ట్ భూముల విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించడంతో అప్రమత్తమైన అధికారులు ఇక్కడి అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. కేసీఆర్ తాజా ఆదేశాలతో తిరిగి చర్యలకు ఉపక్రమించారు.

 

Advertisement
Advertisement