Sakshi News home page

ధాన్యం సేకరణపై రోజూ సమీక్షించండి

Published Fri, Apr 21 2017 2:23 AM

ధాన్యం సేకరణపై రోజూ సమీక్షించండి

జిల్లా కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై ప్రతిరోజూ సమీక్షిం చాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం ఈ మేరకు కొందరు జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు, పౌర సరఫరాల అధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని ఆదేశించారు.

రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐకేపీల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయవచ్చని, అయితే రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్టం చేయాలని కోరారు. వర్ష సూచన ఉన్న సందర్భాల్లో వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, ధాన్యం తడవకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత 48 గంటలలోనే చెల్లింపులు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలు, క్రయవిక్రయాల్లో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలని, ధాన్యాన్ని ఏ రోజు కారోజు మార్కెట్‌ నుంచి మిల్లులకు, గోడౌన్లకు తరలించాలని సూచించారు. ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైతే రవాణా శాఖను సంప్రదించాలని ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement