చెట్లతోనే మానవాళికి మనుగడ | Sakshi
Sakshi News home page

చెట్లతోనే మానవాళికి మనుగడ

Published Sat, Jul 4 2015 2:02 AM

Haritaharam program

జిల్లాలో విజయవంతంగా ప్రారంభం  హంటర్‌రోడ్డులో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం, స్పీకర్
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం జిల్లాలోవిజయవంతంగా ప్రారంభమైంది. ఊరూరా.. వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటారు. హన్మ కొండ హంటర్‌రోడ్డులో డిప్యూటీ సీఎంకడియం శ్రీహరి, స్పీకర్‌తో కలిసి ఈ కార్య క్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
 
 హన్మకొండ : చెట్ల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం శుక్రవారం జిల్లాలో విజయవంతంగా ప్రారంభమైంది. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం కూడలి వద్ద కడియం... శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ హరితహారమన్నారు. సీఎం గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. వర్షాలు లేకపోవడం, పంటలు పండకపోవడం, వలసలు వెళ్లడానికి చెట్లు నశించడమే కారణమన్నారు. మొక్కల పెంపకంతో వాతావరణం సమతుల్యమై వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. చైనా, బ్రెజిల్ దేశాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమంగా తెలంగాణ హరితహారంను చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని పిలుపునిచ్చారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలను పెంచేలా బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మొక్కల సంరక్షణ సులువుగా ఉండేలా సామూహిక మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 4 కోట్ల మొక్కల చొప్పున మూడేళ్లలో 12 కోట్ల మొక్కలను నాటేలా.. ప్రతి గ్రామంలో 40,000 మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ  అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని పిలుపునిచ్చారు. హరితహారాన్ని ప్రతిఒక్కరూ సమష్టి బాధ్యతగా తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హరితహారం పట్ల అకుంఠిత దీక్షతో ముందుకు పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాను అగ్రభాగంలో నిలపాలన్నారు. కాగా, హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న వారిచే ఉప ముఖ్యమంత్రి కడియం ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు పంపిణీ చేశారు.

 జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, కొండా సురేఖ, కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సిటీ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా తదితరులు పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయం నుంచి వరంగల్ హంటర్‌రోడ్డు నాయుడు పెట్రోల్ పంపు వరకు రెండు కిలోమీటర్ల పొడవున విద్యార్థులు, 23 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు 2వేల మొక్కలను నాటారు.  ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ్యులు, కలెక్టర్, ఇతర అధికారులు ఓపెన్‌టాప్ జీప్‌లో ర్యాలీగా వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement