తెలుగులో ఫెలోషిప్ సాధించిన తొలి అంధుడు | Sakshi
Sakshi News home page

తెలుగులో ఫెలోషిప్ సాధించిన తొలి అంధుడు

Published Mon, May 11 2015 2:17 AM

తెలుగులో ఫెలోషిప్ సాధించిన తొలి అంధుడు

హైదరాబాద్: కళ్లు లేవని ఆ విద్యార్థి కలత చెందలేదు. మొక్కవోని దీక్షతో కష్టించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అందించే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్(పీడీఎఫ్)కు ఎంపికయ్యాడు అసిలేటి నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగులో పీడీఎఫ్ సాధించిన ప్రథముడిగా ఈ హెచ్‌సీయూ విద్యార్థి నిలిచాడు. ఐదేళ్ల పాటు దాదాపు రూ. 50 వేల పైచిలుకు ఫెలోషిప్‌ను నాగరాజు పొందనున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో ప్రొఫెసర్ తుమ్మల రామకృష్ణ పర్యవేక్షణలో ఐదేళ్ల పాటు పరిశోధన నిర్వహించనున్నాడు. ‘స్వాతంత్య్రానంతర తెలుగు కథ, విభిన్న ఉద్యమాల ప్రభావం’ అనే అంశంపై ఈ హెచ్‌సీయూ విద్యార్థి అధ్యయనం చేయనున్నాడు.
 భాషా విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తొలి వ్యక్తి ఇతనే..
 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్రలో భాషా విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా సైతం నాగరాజు ఘనత సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, విజయవాడకు చెందిన నాగరాజు అసిలేటి కోటినాగులు, పాపాదేవీల మొదటి సంతానం. పుట్టుకతోనే కళ్లు కోల్పోయినా అకుంఠిత దీక్షతో చదువులో ముందు వరసలో నిలిచాడు. రాజమండ్రిలోని తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ కోర్సులో భాగంగా ‘అమృత హస్తాలు, కథానుశీలన’ అనే అంశంపై చేసిన ఉత్తమ పరిశోధనకుగాను అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

‘తెలుగు కథా సంస్కరణోద్యమం, ప్రభావ చిత్రణ’హెచ్‌సీయూలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అంధులు దేనిలో తీసిపోరని నిరూపించే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలని ఆ విద్యార్థి అంటున్నాడు. ఏదైనా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా చేయాలన్న తన ఆకాంక్షను నాగరాజు ‘సాక్షి’ తెలియజేశాడు.

Advertisement
Advertisement