చదువు ‘కొనాల్సిందే’..! | Sakshi
Sakshi News home page

చదువు ‘కొనాల్సిందే’..!

Published Sun, Jun 22 2014 1:57 AM

చదువు ‘కొనాల్సిందే’..! - Sakshi

‘నెలకైతే ఇంత.. ఏడాది మొత్తం ఒకేసారి కడితే కొంత తగ్గిస్తాం..’ అంటూ చదువును అమ్ముతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యను అంగట్లో వస్తువుగా మార్చేశారు. ప్రైవేటు పాఠశాలల వాళ్లు నిర్ణయించిన ఫీజులను చెల్లించి.. చదువు‘కొనే’ దుస్థితి ఏర్పడింది. విద్యాశాఖాధికారుల సమన్వయంతో విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంతింత పెట్టి చదివిస్తున్నాం మరి.. విద్యాబోధన ఎలా ఉంటుదంటే.. అదీ ఇష్టారాజ్యంగానే కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల ‘ఫీజు’లుంతో పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల చదువులంటేనే భయపడుతున్నారు.
 
నిజామాబాద్‌అర్బన్/బాన్సువాడ : జిల్లాలో 854 ప్రైవేట్‌పాఠశాలలు ఉండగా, అందులో 680 ఉన్నత పాఠశాల లు ఉన్నాయి. ఏడాదికేడాది 20నుంచి 30వరకు కొత్త పాఠశాలలు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఉన్నవాటిలో ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలూ ఉన్నాయి. స్థానిక విద్యాశాఖాధికారిని మచ్చిక చేసుకొని తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాల ఒక్కో విధంగా స్థాని క అధికారికి ముడుపులు అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

టెక్నో, గ్లోబల్, టాలెంట్ పేర్లు తొలగించకుండా రూ.10వేల నుంచి రూ.20వేల వరకు అధికారులకు అందిస్తున్నట్లు తెలిసింది. ఇక పుస్తకాలు, దుస్తుల పేరిట ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న దందాపై కనీసం స్పందించే నాథుడే లేరు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉండాల్సిన నిబంధనలు లేకున్నా.. పాఠశాలల్లో నిపుణులైన టీచర్లు లేకు న్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను చూసుకోవాల్సిన స్థానిక విద్యాశాఖాధికారులు సంబంధిత స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కై ఏమాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
 
35మంది ఇన్‌చార్జిలే
జిల్లాలో 36 మంది ఎంఈవోలకు గానూ 35మంది ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. వీరు పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలల తనిఖీలకూ సాహసించడం లేదు. తమకు ఎంతో కొంత అందుతుంది లే.. అన్న విధానంలోనే వారూ సంతృప్తి చెందుతున్నారు. ఒక్క ఆర్మూర్‌లో 21 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 12వరకు కనీస సౌకర్యాలు లేనివే. సదరు పాఠశాలలు నిబంధనలు పాటించకుండా ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తున్నాయి. ఈ సంగతి తెలిసినా సంబంధిత విద్యాధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
 
ఫీజుల దడ
ఏడాదికేడాది ప్రైవేటు పాఠశాలలో ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్కూళ్లు నర్సరీ, ఎల్‌కేజీ పిల్లలకే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. డొనేషన్, స్కూల్ డెవలప్‌మెంట్ ఫీజులతో పాటు బస్సు చార్జీలు, దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, టై, బెల్ట్‌లు అంటూ వేలు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.40 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇద్దరు , ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులకు చదువు మరింత భారంగా మారుతోంది.
 
నియంత్రణ చర్యలేవి?
ప్రైవేటు పాఠశాలలు ఇష్టారీతిన వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు గత కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లావ్యాప్తంగా ఫీజుల వివరాలను సేకరించారు. అనంతరం ఆయన బదిలీ అయ్యారు. సంబంధిత విద్యాశాఖాధికారులైనా స్పందించి.. అధికంగా ఫీజులు వసూలు చే స్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

నిబంధనలు గాలికి..
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని ఉన్నా.. పట్టించుకోవడం లేదు. స్కూల్ పేరు తర్వాత ఎలాంటి తోకపేర్లు ఉండకూడదన్న నిబంధననూ తుంగలో తొక్కేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేదవిద్యార్థులకు అందించాల్సిన ఉచిత విద్యను ఎక్కడా అమలు చేయడం లేదు. వీటిపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం సదరు స్కూళ్లకు వరంలా మారుతోంది. ఒకవేళ తనిఖీకి వచ్చినా అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ కళ్లు తెరవాలని ప్రైవేట్ పాఠశాలల దూకుడుకు కళ్లెం వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement