ఈదురుగాలుల బీభత్సం | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Published Fri, May 20 2016 1:07 AM

ఈదురుగాలుల బీభత్సం

* ఎగిరిపడ్డ ఇంటికప్పు రేకులు.. నిలిచిన కరెంట్ సరఫరా
* గాలికి ఎగిరిపడ్డ ఊయలలోని చిన్నారి

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వీచడంతో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. మహావృక్షాలు నేలకూలాయి. ఇదే సమయంలో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి.  ఈదురుగాలులకు నిడ్జింత, మన్నాపూర్, దుప్పట్‌గట్, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మక్తల్‌లో ప్రాణభయంతో గొర్రెల కాపరి పూజరి నర్సింలు(30) చెట్టు ఎక్కాడు.

ఈదురుగాలులకు చెట్టు నేలకూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మాగనూర్ మండలం హిందూపురంలో ఓ చిన్నారి రేకుల ఇంట్లో ఊయలలో ఆడుకుంటోంది. బలమైన గాలి వీచడంతో రేకులతోపాటు ఊయల లేచిపోయి అల్లంతదూరాన ముళ్లపొదల్లో పడింది. అక్కడే ఉన్న స్థానికులు కొందరు గుర్తించి ఆ పసికందును తల్లి శాంతమ్మకు అప్పగించారు. మక్తల్‌లో ఈదురుగాలులకు కరెంట్ స్తంభం విరిగిపోయి ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో మహబూబ్‌నగర్- రాయిచూర్ ప్రధానరోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
 
అరగంటలో అతలాకుతలం
బషీరాబాద్: రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో హోరు గాలికి 200 చెట్ల వరకు నేలకూలాయి. కొర్విచెడ్‌లో చెట్టు మీద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని రైస్‌మిల్లులో హోరు గాలికి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మిల్లులోని 200 క్వింటాళ్ల బియ్యం, 80 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయాయి.

Advertisement
Advertisement