రోడ్లు అస్తవ్యస్తం | Sakshi
Sakshi News home page

రోడ్లు అస్తవ్యస్తం

Published Mon, Aug 20 2018 12:44 PM

Heavy Rains Destructive Roads In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రధాన మార్గాల్లోని రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ప్రధాన మార్గాల్లోనూ భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిరావడానికి నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థులు మండల కేంద్రాల్లోని పాఠశాలలు, కళాశాలలకు బస్సుల ద్వారా వెళ్తుంటారు. అలాంటిది పలు మార్గాల్లో బస్సులు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటివరకు వందలాది గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పైనుంచి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది.

 అంతర్రాష్ట్ర రహదారి కోత..
ఆదిలాబాద్‌ నుంచి జైనథ్, బేల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీకి చెందిన అంతర్రాష్ట్ర రహదారి తరోడ గ్రామం వద్ద బ్రిడ్జికి ఆనుకొని రోడ్డు అడ్డంగా కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా భారీ వాహనాలు, ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు లారీలు ఈ మార్గం గుండా మహారాష్ట్ర వైపు వెళ్తుంటాయి. ఇది కోతకు గురికావడం, దాని సమీపం నుంచి రోడ్డును మళ్లించే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రయాణం సంకటంగా మారింది. వర్షం తగ్గుముఖం పడితే తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని యోచిస్తున్నారు.

కాప్రి నుంచి బేల వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు దహెగాం వద్ద కోతకు గురైంది. ఈ మార్గంలోనూ ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గుడిహత్నూర్‌ నుంచి ఉట్నూర్‌ వెళ్లే రోడ్డు మార్గంలో తోషం వద్ద రహదారి సైడ్‌బర్మ్‌ పూర్తిగా తొలగిపోవడంతో రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవాపూర్‌ నుంచి భరంపూర్‌ వెళ్లే మార్గంలో కల్వర్టు వద్ద డ్యామేజీ ఏర్పడింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కాగా జిల్లాలో ఆర్‌అండ్‌బీకి సంబంధించి 507 కిలోమీటర్ల రోడ్డు ఉండగా, రూ.వంద కోట్ల వరకు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల నష్టానికి సంబంధించి ఇంకా అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆదిలాబాద్‌ మండలం చించుఘాట్‌ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. బంగారుగూడ లోలెవల్‌ వంతెన పరిస్థితి కూడా ప్రమాదకరంగా తయారైంది. నార్నూర్‌ మండలంలోని లోలెవల్‌ వంతెనలు పూర్తిగా కుంగిపోయాయి.

 గ్రామీణ ప్రాంతాల్లో వందల కిలోమీటర్లు..
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌కు చెందిన రోడ్లకు వందల కిలోమీటర్లలో నష్టం సంభవించింది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఒక నివేదిక తయారు చేశారు. ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్లను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు అంచనా వ్యయంతోపాటు ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆ రోడ్డును నిర్మించేందుకు అంచనా వ్యయాలను విడివిడిగా రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఇదిలా ఉంటే రాకపోకల్లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంత ప్రజలు రోడ్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్‌కు సంబం«ధించి 2200 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో తారు రోడ్లు 650 కిలోమీటర్ల పరిధిలో ఉండగా, మిగతావి మెటల్, గ్రావెల్‌ రోడ్లు ఉన్నాయి. వరదల కారణంగా తారు రోడ్లకు నష్టం జరగగా, మెటల్, గ్రావెల్‌ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలే ఇబ్బందిగా మారాయి.

మున్సిపాలిటీలోనూ..
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలోనూ భారీ వర్షాలతో రోడ్లకు నష్టం జరిగింది. ప్రధానంగా ఇటీవల మున్సిపాలిటీలో అనుకుంట, కచ్‌కంటితోపాటు మావల, బట్టిసావర్గాం గ్రామపంచాయతీలోని పలు గ్రామాలు విలీనం చేశారు. ఈ వర్షాలకు సుభాష్‌నగర్‌ చెరువు ఉప్పొంగడంతో హరిఓం కాలనీలోని రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వికలాంగుల కాలనీ, అటెండర్‌ కాలనీల్లోనూ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మావల, బట్టిసావర్గాం, దస్నాపూర్, పిట్టలవాడలలో మట్టి రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. మహాలక్ష్మివాడ, చిల్కూరి లక్ష్మీనగర్, గాంధీనగర్‌లోనూ రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.

నివేదిక పంపించాం..
భారీ వర్షాలతో పీఆర్‌ రోడ్లకు జరిగిన నష్టంపై అంచనా తయారు చేశాం. ఈ నివేదికను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తాం. వర్షాలు తగ్గిన వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపడతాం. ఆ తర్వాత పూర్తిస్థాయిలో రోడ్లను పునరుద్ధరిస్తాం. – మారుతి, ఈఈ, పంచాయతీరాజ్‌ 

Advertisement
Advertisement