జోరు వాన | Sakshi
Sakshi News home page

జోరు వాన

Published Tue, Oct 3 2017 2:03 PM

heavy rains in districts - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కరువు ప్రాంతంగా పేరొందిన పాలమూరుపై వరుణుడు తన కరుణ చూపుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా జోరు వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వారం రోజులుగా చెదురు మదురుగా కురుస్తున్న వానలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీగా కురిశాయి. సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా సరాసరి 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం 3గంటల తర్వాత దాదాపు గంటకు పైగా కుండపోతగా కురిసింది. ప్రతీరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణం సాయంత్రం 3గంటల సమయంలో ఒక్కసారిగా చల్లబడుతోంది. ఆకాశమంతా మేఘావృతమై ఒక్కసారిగా వర్షం జోరందుకుంటోంది.

రికార్డు స్థాయిలో..
వారం రోజులుగా జోరు వానలు కురుస్తుండటంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యం గా నారాయణపేట డివిజన్‌ పరిధిలోని చాలా చెరువులు అలుగు పోస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కానీ ఈశాన్య రుతుపవనాల కొత్త ఊపు కారణంగా చెరువులు కుంటలు నిండుతుండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

పదేళ్లలో ఇదే గరిష్టం...
జిల్లాలో వారం రోజులుగా ప్రతీ రోజు వానలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో అక్టోబర్‌ నెలలో ఇంత ఉధృతంగా వర్షాలు కురవడం ఇదే మొదటి సారని వాతావరణ విభాగం పేర్కొంటుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సరాసరిగా 454 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కానీ సాధారణం కంటే తక్కువగా కేవలం 440 మి.మీ. మాత్రమే కురిసింది. అయితే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో మాత్రం వారం రోజుల వ్యవధిలో 98 మి.మీ. వర్షం కురిసింది. ఇలా ఈశాన్య రుతుపవనాలు విజృభించడం గత పదేళ్లలో ఎన్నడూ జరగలేదు. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్‌ 17నుంచి డిసెంబర్‌ 17 వరకు ఉండే ఈ సీజన్‌ మొత్తం కేవలం 111.3 మి.మీ మాత్రమే వర్షం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈసారి కేవలం సీజన్‌ ప్రారంభమైన 15 రోజుల్లోనే 110 మి.మీ వర్షం కురిసింది. అంటే 3నెలల వాన కేవలం 15 రోజుల్లోనే కురిసి కొత్త రికార్డు సృష్టించాయి.
 
13 మండలాల్లో అధిక వర్షం..
తీవ్ర వర్షలోటుతో సతమతమవుతున్న పాలమూరు జిల్లాలో పది రోజు ల్లో పరిస్థితి తారుమారైంది. జిల్లాలోని 26 మండలాలలో దాదాపు 20 మండలాలు తీవ్ర వర్షలోటు ఉండేది. కానీ ప్రస్తుతం .. దాదాపు 13 మం డలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా నారాయణపేట డివిజన్‌లోని ఊట్కూరు మండలం మినహా 10 మండలాల్లో అధిక వర్షపా తం నమోదైంది. జిల్లాలో ఈసారి ధన్వాడ మండలంలో సాధారణం కం టే అధికంగా రికార్డు స్థాయిలో 89.5శాతం అధిక వర్షం కురిసింది. ధన్వా డలో సాధారణంగా 404.2 మి.మీ కురవాల్సి ఉండగా.. 766 మి. మీ కురిసింది. అలాగే దామరగిద్దలో 73.6శాతం, మాగనూరులో 72.6 శాతం అధికంగా కురిసింది. ఎనిమిది మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం నాలుగు మండలాల్లో వర్షలోటు ఉంది.

దేవరకద్రలో..
దేవరకద్ర రూరల్‌: దేవరకద్ర మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుండి ఇంత పెద్ద వర్షం కురవడం ఇదే మొదటిసారి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయి. ఈ వర్షానికి బండర్‌పల్లివాగు పొంగిపొర్లుతుంది. మండలంలోని వెంకటాయపల్లి, గద్దెగూడెం, బస్వాయపల్లి, గోపన్‌పల్లి, లక్ష్మిపల్లి, రేకులంపల్లి, కౌకుంట్ల తదితర గ్రామాల చెరువులు, కుంటల్లోకి కూడా నీరు చేరుతోంది. ఇక దేవరకద్ర మండలం డోకూర్‌ చెరువుకు ఆదివారం రాత్రి కృష్ణాజలాలు వచ్చి చేరాయి. రెండు రోజుల్లో చెరువు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.

నాలుగేళ్ల తర్వాత...
జడ్చర్ల: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల తర్వాత దుందుబీ నదిలోకి సోమవారం కురిసిన కుండపోత వర్షానికి భారీగా నీరు చేరింది. దందుబీ వాగు ప్రవహిస్తే తమ బోర్లు రీచార్జ్‌ అవుతాయని ఈ సందర్బంగా రైతులు తెలిపారు.

ఉధృతంగా పెద్దవాగు
మద్దూరు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మండలంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోస్గి, దౌల్తాబాద్, గండీడ్‌ మండలాల్లో ని వాగుల నీరంతా పెద్దవాగుకు రావడంతో ఉధృతి మరింత పెరిగింది. లింగల్‌చేడ్‌ దగ్గర ఉన్న రోడ్డు వంతెనను ఆనుకుని వాగు పారింది.

నీట మునిగిన మందిపల్లి తండా
ధన్వాడ: కేఎస్పీ కాలువ నీటికి తోడు సోమవారం ఉదయం కురిసిన వర్షపు నీటితో ధన్వాడ మండలంలోని మందిపల్లి తండా నీట మునిగింది. నీరు మొత్తం ఇళ్లలోకి రావడంతో సరుకులు మునిగి పోయాయని తండావాసులు వాపోయారు. అలాగే, పలువురు రైతుల వరి పొలాలు సైతం నీట మునిగాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement