వర్ష బీభత్సం | Sakshi
Sakshi News home page

వర్ష బీభత్సం

Published Tue, Sep 9 2014 12:26 AM

వర్ష బీభత్సం

 ఆదిలాబాద్, సాక్షి ప్రతినిధి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిర్పూర్, కౌటాల, బెజ్జూరు మండలాల్లో రెండు రోజులపాటు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వార్థ నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్‌గంగా ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. అడ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో కొమురం భీమ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు. అలాగే కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో నాలుగు గేట్లు తెరిచి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు.

 120 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
 వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. కౌటాల, బెజ్జూరు, దహెగాం, కాగజ్‌నగర్ తదితర మండలాల పరిధిలో సుమారు 120 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కేవలం మా రుమూల గ్రామాలే కాదు, బెజ్జూరు మండల కేంద్రానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయంటే వర్ష బీభత్సా న్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మండలాల్లోని గ్రామాల ప్రజలు ఎడ్లబండ్లపై వాగు దాటి తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు.

వరద ఉధృతి ఇదే విధంగ కొనసాగితే నేడు(మంగళవారం) ఉదయం వరకు ఎడ్లబండ్లతో ప్రయాణించడం కష్టం కానుంది. సిర్పూర్-మహారాష్ట్ర రోడ్డులో వెంకట్రావ్‌పేట గ్రామ సమీపంలోని పెన్‌గంగా నదిపై ఉన్న వంతెన పైకప్పునకు సమాన స్థాయిలో వరదనీరు ప్రవహిస్తుంది. వంతెనకు సమీపంలోని మహారాష్ట్రలోని పోడిషా గ్రామ సమీపంలో రోడ్డు పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో మహారాష్ట్రకు రాకపోకలు సాగించే ప్రయాణికులు నాటు పడవల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు.

 భారీ నష్టం
 రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆదివారం జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వాగు దాటుతూ వరద ఉధృతికి గల్లంతు కాగా, ఆస్తి నష్టం కూడా భారీగానే వాటిల్లింది. తిర్యాణి మండలం ఇర్కపల్లికి చెందిన హన్మంతరావు (25) అనే యువకుడు చెలిమెలవాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌కు చెందిన ఎస్.కిషన్ (32) అనే యువకుడు కూడా గల్లంతయ్యాడు. జిల్లా వ్యాప్తంగా 662 ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఇందులో 77 నివాసాలు పూర్తిగా కూలిపోవడంతో ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

 పంట నష్టం
 అధిక వర్షాలకు పంట చేలల్లో నీరు చేరింది. ఇప్పటి వరకు దహెగాం, సిర్పూర్-టి మండలాల్లో పంట నష్టం వివరాలు అందాయి. సుమారు 1160 ఎకరాల్లో సోయా, 985 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే బెజ్జూరు మండలంలో మూడు చెరువులు, నెన్నెల్లో మరో చెరువుకు గండిపడింది.

 జాతీయ విపత్తు నియంత్రణ బృందాలు
 అధిక వర్షాల ప్రభావిత మండలాల్లో పరిస్థితులను, తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌లు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే రిస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ విపత్తు నియంత్రణ బృందాలను సిర్పూర్‌లో అందుబాటులో ఉంచారు. జిల్లాలో రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌటాల మండలం కన్నేపల్లి గ్రామంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురికాగా సుమారు 140 మంది గ్రామస్తులను కన్నేపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ధరంపల్లి గ్రామానికి చెందిన మరో 150 మందిని డబ్బా గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.

 అప్పుడు అధికం.. ఇప్పుడు అథమం..
 బజార్‌హత్నూర్ 17 సెంటీమీటర్లు, సారంగపూర్ 14.9, నిర్మల్ 12, కుంటాల 11.7, లోకేశ్వరం 11, ఇచ్చోడ 10.4, దిలావర్‌నూర్ 10.1, జైనూర్ 10.1, భైంసా 9.7, జైనథ్ 9.4, నార్నూర్ 9.6, కడెం పెద్దూర్ 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 9 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణ వర్షపాతం 897.5 మిటీమీటర్లు కాగా 679.4 మిల్లీమీటర్లు పడింది. 25 శాతం లోటుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,269 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 29 శాతం అధికంగా పడింది.

Advertisement
Advertisement