ఘర్ వాపసీ... | Sakshi
Sakshi News home page

ఘర్ వాపసీ...

Published Mon, Jan 19 2015 2:13 AM

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో హైవేపై నిలిచిన వాహనాలు

సంక్రాంతికి ఊరెళ్లి, తిరుగుప్రయాణమైన నగరవాసులు
టోల్‌ప్లాజాల వద్ద భారీగా రద్దీ.. ట్రాఫిక్‌జామ్‌తో ఇక్కట్లు


చౌటుప్పల్: సంక్రాంతి పర్వదినానికి హైదరాబాద్ మహానగరం విడిచి వెళ్లిన వారంతా మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ బాగా పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల వాహనాలు తిరుగుతుండగా, ఆదివారం 30 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సంక్రాంతి పండగ ముందు తమ స్వగ్రామాలకు వెళ్లారు. పండుగ ముగియడం.. సోమవారం పనిదినం కావడంతో అంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి విజయవాడ వైపు నుంచి వాహనాల రద్దీ పెరిగింది.

హైవేపై నున్న టోల్‌ప్లాజాలకు వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ట్రాఫిక్‌జామ్ కాకుండా జీఎంఆర్ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ దాటేందుకు దాదాపు 15 నిమిషాల నుంచి అరగంట పట్టడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పైగా ఆదివారం సంతదినం కావడం, సంస్థాన్ నారాయణపురం వైపు వెళ్లే వాహనాలు కూడా అధికంగా రావడం, ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Advertisement
Advertisement