ఆధార్‌లా ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డు | Sakshi
Sakshi News home page

ఆధార్‌లా ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డు

Published Fri, Dec 4 2015 2:09 AM

ఆధార్‌లా ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డు - Sakshi

 ఆరోగ్య సమాచారం సేకరించి ఇస్తామన్న కేటీఆర్
 హైదరాబాద్: 'రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం సేకరిస్తాం. దాన్ని డిజిటలైజ్డ్ హెల్త్‌కేర్ ద్వారా భద్రపరుస్తాం. ఆధార్ తరహాలో ఆ వివరాలను తెలుపుతూ హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది' అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నానక్‌రాంగూడ హయత్ హోటల్‌లో 'సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్'ను గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... 'రాష్ట్రంలోని 3.6కోట్ల మంది ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తాం. ప్రతి ఒక్కరికీ యూనిక్ నంబర్ ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య సమస్య లు, బ్లడ్ గ్రూప్ తదితర వివరాలు అవసరమైనప్పుడు ఒక్క క్లిక్‌లో తెలుసుకొనే వీలుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ డిజిటలైజేషన్ చేసి, రాజధాని ద్వారా అందరితో మాట్లాడి తగిన చర్యలు తీసుకొనేలా మార్పులు చేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులల్లో డాక్టర్లు, స్పెషలిస్ట్‌లను నియమించేందుకు తగిన చర్యలు తీసుకొంటాం' అన్నారు.

 ఐటీ, ఏరోస్పేస్, హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యం: 'రాష్ట్ర ప్రభుత్వం మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో మొదటిది ఐటీ రంగం. తరువాత ఏరో స్పేస్ సెంటర్, హెల్త్‌కేర్. ఇప్పటికే ఐటీ విస్తరణ సాగింది. ఏరో స్పేస్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఆరోగ్య పరిరక్షణపై కూడా పూర్తి స్థాయి దృష్టి సారించాం' అని కేటీఆర్ చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఇండియన్ రివర్స్ అడ్వైజరీ కార్పొరేషన్ ఎండీ అవినాశ్, ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ దేశాయ్, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ నారాయణన్ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement