కొత్త సీఎస్ సతీమణికి హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

కొత్త సీఎస్ సతీమణికి హైకోర్టు నోటీసులు

Published Fri, Dec 2 2016 1:35 AM

కొత్త సీఎస్ సతీమణికి హైకోర్టు నోటీసులు - Sakshi

 సాక్షి, హైదరాబాద్: పదోన్నతి వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర సతీమణి డాక్టర్ కె.సుజాతకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యాశాఖ డెరైక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తదితరులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. తనకన్నా జూనియర్లయిన డాక్టర్ సుజాత మరో 10 మంది డాక్టర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నవంబర్ 19న జీవో నం.995 జారీ చేసిందంటూ.. 
 
 ఆ జీవోను సవాలు చేస్తూ గాంధీ ఆస్పత్రి పీడియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.భారతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ప్రభాకర శ్రీపాద వాదనలు వినిపిస్తూ, 2016-17 సంవత్సరానికి పీడియాట్రిక్స్ విభాగం సీనియారిటీ జాబితాలో భారతి నాలుగో స్థానంలో ఉన్నారని తెలిపారు. అయితే స్క్రీనింగ్ కమిటీ మాత్రం ఆమెను పక్కన పెట్టిందని, దీనిపై ఆమె వెంటనే వైద్య విద్యాశాఖ డెరైక్టర్‌కు వినతిపత్రం సమర్పించారని వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వం భారతికన్నా జూనియర్లయిన 11 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 
 

Advertisement
Advertisement