‘పద్మభూషణ్‌’ దుర్వినియోగంపై స్పందించిన హైకోర్టు | Sakshi
Sakshi News home page

‘పద్మభూషణ్‌’ దుర్వినియోగంపై స్పందించిన హైకోర్టు

Published Wed, Apr 25 2018 4:03 AM

High Court to respond to Padma Bhushan misuse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ చాన్సలర్‌ డాక్టర్‌ శాంతారాం బల్వంత్‌ మజుందార్‌ తన పేరు ముందు పద్మభూషణ్‌ బిరుదును ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, శాంతారాం బల్వంత్‌ మజుందార్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మభూషణ్‌ను శాంతారాం మజుందార్‌ దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో అవార్డును వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది వై.శ్రీధర్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.   

Advertisement
Advertisement