అద్దె బస్సుల టెండర్‌పై స్టేకు నో

23 Oct, 2019 04:01 IST|Sakshi

రిట్‌ పిటిషన్‌ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సంస్థ 1,035 అద్దె బస్సుల్ని ఏడాది పాటు తీసుకునేందుకు పిలిచిన టెండర్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన రిట్‌పిటిషన్‌ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారమైతే అంత పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సుల్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదని, కాబట్టి మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వాలంటూ టీఎస్‌ ఆర్టీసీ కార్మిక్‌ సంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమేశ్‌ కుమార్‌ దాఖలు చేసిన రిట్‌ను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారించారు. సమ్మె కాలానికి అద్దె బస్సులు తీసుకోవడం సబబేనని, ఏడాది కాలానికి అద్దెకు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టమని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సూర్యకరణ్‌రెడ్డి వాదించారు.

ఆర్టీసీ సమ్మెపై వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఉన్నాయని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు చెప్పారు. దీంతో ఈ రిట్‌ను కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తి నిర్ణయించారు. ఈ దశలో పిటిషనర్‌ న్యాయవాది కల్పించుకుని, ఏడాదిపాటు అద్దెకు తీసుకోకుండా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకునేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా, ఈ విషయాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా