మా ఉత్తర్వులంటే లెక్క లేదా? | Sakshi
Sakshi News home page

మా ఉత్తర్వులంటే లెక్క లేదా?

Published Thu, Apr 23 2015 1:03 AM

high court serious on snigdha reddy

స్నిగ్ధారెడ్డి వ్యవహారంలో గనులశాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు

హైదరాబాద్: మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గనుల తవ్వకాల వ్యవహారంలో అధికారుల తీరుపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నిగ్ధారెడ్డి తదితరులకు సహకరించేందుకు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ మండిపడింది. లీజు ప్రాంతాన్ని దాటి మైనింగ్ నిర్వహించినందుకు ఎందుకు లీజు రద్దు చేయకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని చెబితే, ఆ పని చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మా ఉత్తర్వులంటే లెక్క లేదా అని ప్రశ్నించింది.

అధికారుల తీరును గమనిస్తుంటే, వారు అవతలి వారికి (స్నిగ్ధారెడ్డి, భరతసింహారెడ్డి) సహకరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తాము ఆదేశించిన విధంగా స్నిగ్ధారెడ్డికి ఎందుకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదో వివరిస్తూ, ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని గనులశాఖ డెరైక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోసలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement
Advertisement