123 జీవో రద్దుపై స్టే | Sakshi
Sakshi News home page

123 జీవో రద్దుపై స్టే

Published Wed, Aug 10 2016 1:43 AM

high court stay on 123 G.O cancel orders

సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ఊరట
భూసేకరణ చట్టం షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలు కల్పించాలి
ఆ మేరకు జీవో జారీ చేసి.. మా ముందుంచండి
అప్పటి వరకు ఎవరినీ ఖాళీ చేయించవద్దు
వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దు
కొత్త జీవోను పరిశీలించాకే రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తాం
తుది తీర్పునకు లోబడే భూముల కొనుగోళ్లు ఉంటాయని స్పష్టీకరణ
మధ్యంతర ఉత్తర్వులు జారీ.. విచారణ గురువారానికి వాయిదా

 
 సాక్షి, హైదరాబాద్
 సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక అవసరాలకు భూముల సేకరణ కోసం జారీ చేసిన జీవో 123 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ జీవో 123ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేసింది. ఈ జీవో కింద చేసిన భూముల కొనుగోళ్లన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఆయా భూములపై ఆధారపడి జీవిస్తున్న వారికి కల్పిస్తామన్ని చెబుతున్న ప్రయోజనాలన్నింటిని పేర్కొంటూ మరో జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ చట్టం-2013లోని షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలు లేదా వాటి కన్నా ఎక్కువ ప్రయోజనాలను కల్పించాలని స్పష్టం చేసింది.

ఆ జీవోను జారీ చేశాక దానిని తమకు అందజేయాలని.. అది సంతృప్తికరంగా ఉంటేనే రైతుల నుంచి కొన్న భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తామని పేర్కొంది. నిమ్జ్‌కు అవసరమైన మొత్తం 12,600 ఎకరాల భూమి సమకూరి, బాధితులందరికీ చట్ట ప్రకారం వర్తింప చేయాల్సిన ప్రయోజనాలన్నీ అందే వరకూ వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని.. వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
 
 ఉద్యోగాలివ్వాలని చట్టం చెబుతోంది
 మెదక్ జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కోసం అవసరమైన భూములను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు వీలుగా జారీ చేసిన జీవో 123ను ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. దీనిని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి వాదనలు వినిపిస్తూ... బాధితులకు వర్తింప చేస్తున్న ప్రయోజనాలపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తన క్లయింట్లతో చర్చించానని, వారు తమ ఉద్యోగావకాశాల గురించి ప్రశ్నించారని ధర్మాసనానికి తెలిపారు. భూములను సేకరించి స్థాపిస్తున్న పరిశ్రమల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని భూసేకరణ చట్టం షెడ్యూల్ 2 స్పష్టం చేస్తోందని విన్నవించారు.

పిటిషనర్లు నిర్వాసితులు కాదని.. కానీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో నిర్వాసితులకు చెల్లించే పరిహారం గురించి మాత్రమే ప్రస్తావన ఉందన్నారు. పిటిషనర్లలో ఇద్దరు వితంతువులున్నారని, వారికి జీవిత భాగస్వామి లేనందున ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం కేవలం రూ.1.25 లక్షల చొప్పున మాత్రమే పొందగలుగుతారని వివరించారు. ఇక భూసేకరణ చట్టంలో వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ఎటువంటి షరతులూ లేవని... ప్రభుత్వ ప్రతిపాదనల్లో మాత్రం షరతులు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని షరతులు చేర్చే అవకాశముందని, దాని వల్ల బాధితులకు ఇబ్బందులు తప్పవని నివేదించారు.
 
ఉద్యోగాలిస్తాం..
తరువాత అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడు భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించడం లేదని ధర్మాసనానికి తెలిపారు. భూములు ఖాళీ చేసి వెళతామంటే నిబంధనల మేరకు చెల్లింపులు చేస్తామన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ... భూములు అమ్ముకున్న వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోతారని, కూలీలు అక్కడే ఉంటారని పేర్కొన్నారు. చిన్న విస్తీర్ణంలో భూములున్న వాళ్లు భూమిని విక్రయించడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... స్వచ్ఛందంగా భూములు విక్రయించని వారి జోలికి వెళ్లబోమని ప్రభుత్వం చెబుతోందని, ప్రభుత్వంపై అంత అపనమ్మకం ఎందుకని పేర్కొంది.

ఇక కోర్టు ముందుంచిన అఫిడవిట్‌లో షెడ్యూల్ 2లోని అంశాల ప్రస్తావన లేదని, బాధితులకు ఉద్యోగం కల్పించే సంగతేమిటని ఏజీని ప్రశ్నించింది. దీంతో కోర్టులోనే ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో మాట్లాడిన ఏజీ.. ఉద్యోగాలు కల్పిస్తామని ధర్మాసనానికి చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రయోజనాలు వర్తింప జేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో... దానిని జీవో ద్వారా అమలు చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. జీవో రద్దు చేస్తే పరిస్థితేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రద్దు చేస్తే ఎవరి భూములు వారికి అప్పగిస్తారని ధర్మాసనం పేర్కొంది.
 
నిమ్జ్‌కే వర్తింప చేయడం సరికాదు
బాధితులకు ప్రయోజనాల కోసం జారీ చేసే జీవోను నిమ్జ్‌కు మాత్రమే వర్తింప చేయవద్దని, అన్ని ప్రాజెక్టులకు వర్తింపజేయాలని ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న పలువురు సీనియర్ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దాంతోపాటు సింగిల్ జడ్జి తీర్పుపై స్టేను నిమ్జ్‌కే వర్తింపజేయాలని, లేకపోతే జీవో అమల్లోకి వచ్చిందంటూ తిరిగి భూములను తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ రెండు రోజుల్లోనే ఏమీ కాదని పేర్కొంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఆ రోజే విచారణ జరుపుతామని పేర్కొంది. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement