బీఆర్‌ఎస్‌ స్క్రూటినీ షురూ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ స్క్రూటినీ షురూ

Published Tue, Oct 17 2017 3:24 AM

High Court to stay on the settlement of the BRS application - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు రెండేళ్లుగా పట్టించుకోని బీఆర్‌ఎస్‌ దరఖాస్తులపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించారు. వచ్చే నెలాఖరులోగా దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన పూర్తి చేసి, మొత్తం దరఖాస్తుల్లో అనర్హమయ్యేవెన్నో తొలుత గుర్తించనున్నారు. ఈ వివరాలను హైకోర్టుకు నివేదించి.. దాని ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలతో దరఖాస్తులను పరిష్కరించనున్నారు. బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల కింద అక్రమ భవనాలు, అక్రమ లేఔట్లను క్రమబద్ధీకరించేందుకు జీహెచ్‌ఎంసీ దరఖాస్తులు స్వీకరించి దాదాపు రెండేళ్లవుతోంది. బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంపై స్టే విధించిన హైకోర్టు.. మొత్తం దరఖాస్తులను పరిశీలించి అర్హమయ్యేవెన్నో.. అర్హత పొందని వాటిలో ఎలాంటి ఉల్లంఘనలున్నాయో తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది.

వాటిని తాము పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశాక మాత్రమే అర్హమయ్యే దరఖాస్తులను పరిష్కరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల జోలికి వెళ్లకుండా... ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్ని పరిష్కరించే పనిలో పడ్డారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఫైళ్లను పరిష్కరించేందుకు తమకు అనుమతిస్తూ స్టే ఎత్తివేయాలని దాదాపు నెలన్నర క్రితం హైకోర్టును కోరారు. తొలుత దరఖాస్తులను స్క్రూటినీ చేసి రిజెక్ట్‌ అయినవెన్నో తెలపాలని హైకోర్టు సూచించింది. దీంతో ఈనెల ఆరంభం నుంచే బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల స్క్రూటినీ ప్రారంభించాలని అనుకున్నప్పటికీ వరుస వర్షాలతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శిథిల భవనాలపై చర్యలు తీసుకోవడంతో పాటు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంపై శ్రద్ధ చూపారు.

ఇతరత్రా అత్యవసర పనులతో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల స్క్రూటినీ ప్రారంభించలేదు. దరఖాస్తుల స్క్రూటినీ ఇటీవలే ప్రారంభమైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం చివరి దశలో ఉండటంతో అది పూర్తికాగానే బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయనున్నారు. నవంబర్‌ నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి కాగలదని అంచనా. స్క్రూటినీ పూర్తయ్యాక హైకోర్టుకు నివేదిక అందజేయనున్నారు.

స్క్రూటినీ ఇలా..
బీఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించారు. భవనం ఎన్ని అంతస్తుల్లో ఉంది.. నివాసమా, వాణిజ్య భవనమా అనే అంశాల వారీగా దరఖాస్తుల్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో పరిశీలించనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement