1800 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరా? | Sakshi
Sakshi News home page

1800 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరా?

Published Fri, Jul 27 2018 2:16 AM

High Court on Teacher Transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1800 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేని పరిస్థితుల వల్ల ఆ బడులు మూతపడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసిన హైకోర్టు, ఆ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పిల్లలతో సహా ప్రజా ప్రతినిధుల పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తుంటారు. ఈ విషయంలో అక్కడ తల్లిదండ్రుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ (తెలంగాణ) లో ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం. ఇక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుని పరిస్థితిలో మార్పు తీసుకురావాలి.’అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని, ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ఎం.వీ.ఫౌండేషన్‌ కన్వీనర్‌ ఆర్‌.వెంకట్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజే కేరళలలో ప్రజా ప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement