Sakshi News home page

రికార్డుల్లేవంటే.. అధికారులకు జైలే!

Published Tue, Jul 24 2018 2:20 AM

High Court warning to education department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ–1998 నియామకాల్లో జరిగిన అక్రమాల్ని తొలగించి మెరిట్‌ జాబితా ప్రకటించాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడానికి రికార్డులు అందుబాటులో లేవని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో జారీ చేసిన ఆదేశాల్ని కావాలనే అమలు చేయడం లేదని, ఇదే తీరు కొనసాగిస్తే బాధ్యులైన అధికారులను జైళ్లకు పంపాల్సివస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు హెచ్చరించారు. కోర్టు ఆదేశాలు అమలు కాలేదని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి.

ఈ సందర్భంగా డీఎస్సీ– 1998 రికార్డులు లేనందున హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌రావు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి మండిపడ్డారు. ‘కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.

రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు మెరిట్‌ జాబితాను ప్రభుత్వమే అందజేసింది. రికార్డులు లేకపోతే సుప్రీంకోర్టుకు ఎలా ఇచ్చారు? కావాలనే కాలయాపన చేస్తున్నారు. మెరిట్‌ జాబితాలో అక్రమాల్ని సవరిస్తామని ప్రభుత్వమే చెప్పి పిటిషనర్లయిన నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఇప్పుడు దాన్ని పట్టించుకోరా?..’అంటూ న్యాయమూర్తి నిలదీశారు. కోర్టు ఆదేశాల్ని అమలు చేసే అవకాశమే లేదని సంజీవ్‌కుమార్‌ చెప్పగానే.. న్యాయమూర్తి కల్పించుకుని అదే జరిగితే బాధ్యులైన అధికారులను జైళ్లకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల్ని అందజేసేందుకు విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.

ఆ విచారణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ స్వయంగా హాజరుకావాలని, ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement