ఇప్పుడు స్టే ఇవ్వలేం | Sakshi
Sakshi News home page

ఇప్పుడు స్టే ఇవ్వలేం

Published Fri, Jun 30 2017 1:43 AM

ఇప్పుడు స్టే ఇవ్వలేం - Sakshi

విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విలీనంపై హైకోర్టు
► విలీన ప్రక్రియ ఇప్పుడే పూర్తయ్యేది కాదని సంస్థలు చెబుతున్నాయి  
► బయోడేటాల పరిశీలనకు కమిటీ వేశామంటున్నాయి
► ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్‌:  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లను విలీనం చేసుకోవాలన్న విద్యుత్‌ సంస్థల నిర్ణయంపై స్టే విధించేందుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విలీన ప్రక్రియ ఇప్పటికిప్పుడు పూర్తయ్యేది కాదని, ప్రస్తుతం వారి బయోడేటాల పరిశీలన నిమిత్తం కమిటీని మాత్రమే ఏర్పాటు చేశామని విద్యుత్‌ సంస్థలు చెబుతున్నా యని పేర్కొంది. ఈ దశలో విలీన ప్రక్రియ నిలుపుదలకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

అంతేకాకుండా కార్మిక సంఘాల సమాఖ్యతో విద్యుత్‌ సంస్థల రాజీ ప్రక్రియ కొనసాగుతోందని, ఆ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చాకే విలీన నిర్ణయంపై ముందుకు వెళతామని వివరించిన విషయాన్ని గుర్తు చేసింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా విలీన ప్రక్రి య జరుగుతోందని తాము ప్రాథమిక నిర్ణయానికి వస్తే తప్పక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఆలోపు విలీన ప్రక్రియ ఏదైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్‌కు సూచిస్తూ... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడప్పుడే పూర్తికాదు
సుమారు 24 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విలీనం చేసుకోవాలన్న విద్యుత్‌ సంస్థల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సంద ర్భంగా టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) ఎస్‌.అశోక్‌కుమార్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. తొలుత విద్యుత్‌ సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ... అసలు పిటిషనర్‌ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని కోర్టుకు విన్నవించారు.

విద్యుత్‌ కార్మిక సంఘాల సమాఖ్య తమ డిమాండ్లను నెరవేర్చుకు నేందుకు పలుమార్లు సమ్మె నోటీసు ఇచ్చిందని, ఆ సమాఖ్యతో రాజీ చేసుకుని ఒక ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ కొనసాగుతోందని... ఆ ప్రక్రియ పూర్తికా కుండా ఔట్‌సోర్సింగ్‌ విలీన ప్రక్రియ పూర్తికాదని వివరించారు. కేవలం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బయోడేటాలను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. విలీనం చేసుకోవాలని భావిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అర్హత ఏమిటి? నియామక మార్గదర్శకాలు ఏమైనా జారీ చేశారా? అని ప్రశ్నించింది. దీంతో తొలుత రాజీ ప్రక్రియ పూర్తయ్యాకే మిగతా విషయాల్లో ముందుకెళతామని విద్యాసాగర్‌ తెలిపారు.

పైకి లేదంటూనే..
అనంతరం పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. విద్యుత్‌ సంస్థలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయడం లేదని పైకి చెబుతూనే.. లోపల మాత్రం అన్ని పనులు పూర్తి చేస్తున్నాయని కోర్టుకు వివరించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అసలు విద్యుత్‌ సంస్థలకు చెందిన వారు కారని, కాంట్రాక్టర్లు ఆయా సేవల నిమి త్తం ప్రైవేటు వ్యక్తులను పంపుతారని, అటువంటి వారిని ఎలా విలీనం చేసుకుంటారని ప్రశ్నించారు. విలీన నిర్ణయం వల్ల వేల మంది నిరుద్యోగులు బాధితులవుతున్నారని.. దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చేందుకు విద్యుత్‌ సంస్థలు సాకులు చెబుతున్నాయని ఆరోపించారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విలీనం చేసుకోవాలని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని, ప్రస్తుతం జరుగుతున్నది ఓ ప్రహసనం మాత్రమేనని కోర్టుకు నివేదించారు. ఒకవైపు సర్క్యులర్‌ ఇస్తూ, కమిటీలు ఏర్పాటు చేస్తూ, మార్గదర్శకాలు రూపొందిస్తూ మరోవైపు ఏమీ జరగడం లేదని చెప్పడం విద్యుత్‌ సంస్థలకే చెల్లుతోందని పేర్కొన్నారు. విలీన ప్రక్రియను నిలిపివేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విద్యుత్‌ సంస్థల వాదనల పట్ల సంతృప్తికరంగా ఉన్నామని పేర్కొంది. ఈ మేరకు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని తెలిపింది.

Advertisement
Advertisement