18 రోజులు.. 500 మి.యూ. విద్యుదుత్పత్తి!  | Sakshi
Sakshi News home page

18 రోజులు.. 500 మి.యూ. విద్యుదుత్పత్తి! 

Published Wed, Sep 5 2018 2:26 AM

History created by Srisailam Underground center - Sakshi

దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం ప్రాజెక్టులోని ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం చరిత్ర సృష్టించింది. శ్రీశైలం జలాశయంలోకి సరిపడా నీటి వనరులు ఉండటంతో జూలై 23 నుంచి ఈ నెల 2వ తేదీ ఆదివారం వరకు టీఎస్‌జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌ నుంచి 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్లతో 500 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు కేంద్రం చీఫ్‌ ఇంజనీర్‌ మంగేశ్‌కుమార్, ఎస్‌ఈ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు.

భూగర్భ కేంద్రం నిర్మాణం తర్వాత నిర్విరామంగా 18 రోజులు పాటు 6 యూనిట్లు ఆగకుండా విద్యుదుత్పత్తి చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్విరామంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా.. లోడ్‌ డిస్పాచ్‌లో డిమాండ్‌ లేనందున అడిగినప్పుడే విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను అభినందించిన సీఈ, ఎస్‌ఈలు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఈఈ రవీందర్, డీఈలు శ్రీకుమార్‌గౌడ్, చంద్రశేఖర్, ఆనంద్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఏవో రామకృష్ణ, ఏడీఈలు కుమారస్వామి, మదన్‌మోహన్‌రెడ్డి, కృష్ణదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement