మూట మూసీకే..

27 Mar, 2019 07:52 IST|Sakshi

మూసీ సుందరీకరణకు ‘మహా’ నిధులు  

ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల విక్రయ డబ్బులు వెచ్చింపు  

అందుబాటులో 67 ప్లాట్లు  

రూ.600 కోట్లు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారుల అంచనా  

ప్రక్షాళనకు ముందడుగేస్తున్న మూసీ రివర్‌ఫ్రంట్‌

డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లలోని ప్లాట్ల విక్రయాలతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు సమకూరనున్న ఆదాయాన్ని మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు వెచ్చించనున్నారు. ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో 67 ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించనున్నారు. దీని ద్వారా సమకూరనున్న ఆదాయాన్ని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీ)కు బదలాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ, ఆ ప్లాట్లకు సంబంధించి నిర్మాణ అనుమతులు హెచ్‌ఎండీఏకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన ధర ప్రకారం గజం రూ.28 వేల చొప్పున విక్రయిస్తే... 1,31,579.31 గజాలకు రూ.368.42 కోట్లు వస్తాయి. అయితే ఆన్‌లైన్‌ వేలం కాబట్టి గజం ధర రూ.40 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని, దాదాపు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా  వేస్తున్నారు. ఎంఆర్‌డీసీ ఈ నిధులను తొలి విడతలో పురానాపూల్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వరకు మూసీ సుందరీకరణ, వాకింగ్‌ ట్రాక్, సైకిల్‌ ట్రాక్, వాక్‌వేస్, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, గార్డెనింగ్, కియోస్కోలు, బోటింగ్‌ సదుపాయాలకు వెచ్చించనున్నట్లు హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. 

13 ఏళ్లుగా ప్రక్రియ...  
2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ల్యాండ్‌పూలింగ్‌ కింద ఉప్పల్‌ భగాయత్‌ రైతుల నుంచి హెచ్‌ఎండీఏ 733 ఎకరాలు సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు నీటి శుద్ధి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత స్థలం కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్‌ భగాయత్‌ పేరుతో లేఅవుట్‌లు అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్‌సీ భూములు ఉండటంతో ప్లాట్ల కేటాయింపులో ఆలస్యమైంది. గతేడాది మార్చిలోనే భూములు కోల్పోయిన 1,520 మంది రైతులకు లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించింది. ఎకరం భూమి కోల్పోయిన వారికి వేయి గజాల చొప్పున ఇచ్చింది.  8,84,205 చదరపు గజాల్లో లేఅవుట్‌లు చేయగా 7,58,242 చదరపు గజాలు వీరికి కేటాయించింది. మిగతా 1,31,579.31 గజాల ప్లాట్లను ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో వేలం వేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌కు చెందిన ఈ ప్రొక్యూర్‌మెంట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు ఈ–వేలానికి, ఆర్థిక లావాదేవీల కోసం హెచ్‌డీఎఫ్‌సీ సహకారాన్ని తీసుకున్నారు. అయితే ఈ–వేలంలో 120కి మించి బిడ్డర్లు పాల్గొనకపోవడం, ఈ–వేలం సమయంలో సాంకేతిక సమస్య లు ఏర్పడడంతో అప్పటి కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి వేలం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉప్పల్‌ భగాయత్‌ రెండో విడతలో 72 ఎకరాలు, మూడో విడతలో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా భవిష్యత్తులో వేలం వేయనుంది.

మరిన్ని వార్తలు