ఆ 50 లక్షలు’ ఏపీ సొమ్మే! | Sakshi
Sakshi News home page

ఆ 50 లక్షలు’ ఏపీ సొమ్మే!

Published Wed, Jun 3 2015 1:43 AM

ఆ 50 లక్షలు’ ఏపీ సొమ్మే!

స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన మొత్తంపై అధికారుల అంచనా
అవి ఏ ఖాతా నుంచి వచ్చాయో ఆరా తీస్తున్న ఏసీబీ
ఐటీ శాఖతో కలసి దర్యాప్తు

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి స్వయంగా అందజేసిన రూ. 50 లక్షల మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నోట్ల కట్టలపై ఉన్న బ్యాంకు స్లిప్పులు, డినామినేషన్ల ప్రకారం ఏ బ్యాంకు నుంచి అంత మొత్తాన్ని డ్రా చేశారనే అంశంపై ప్రత్యేకంగా ఓ బృందం దర్యాప్తు చేస్తోంది.

సీజ్ చేసిన రూ. 50 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేయాలని ఐటీ శాఖ కోరినా, ఇప్పటికీ ఏసీబీ కస్టడీలోనే ఆ మొత్తాన్ని ఉంచి ఏయే బ్యాంకుల నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఐటీ శాఖ సహకారంతో ఏసీబీ రూ.50 లక్షల ఆపరేషన్ సాగిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి రెండు మూడు విడతలుగా ఒకేసారి లక్షల మొత్తంలో డ్రా చేస్తే తప్ప రూ. 50 లక్షలను తీసుకురాలేరని, ఏ బ్యాంకు నుంచి డబ్బు వచ్చిందో తేలితే డిపాజిటర్ల వివరాలను బట్టి ఖాతాల లెక్కలు కూడా తెలుస్తాయని అధికారులు యోచించి తదనుగుణంగా ముందుకు సాగుతున్నారు.

నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హారీ, ఉదయ్‌సింహల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ రికార్డులను బట్టి కూడా డబ్బు కట్టల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక విచారణ జరిపితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరిద్దరు బడా వ్యక్తుల నుంచే పెద్ద మొత్తంలో డ్రా అయినట్లు తేలిందని సమాచారం. తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉండే ఓ సినీ నిర్మాత, ఏపీకి చెందిన ఓ మంత్రికి సంబంధించిన వ్యక్తుల ఖాతాల నుంచే కాకుండా హవాలా పద్ధతిలో వచ్చిన మొత్తం కూడా ఈ నోట్ల కట్టల్లో ఉందని సమాచారం.

Advertisement
Advertisement