గురుకుల సీట్లకు భలే క్రేజ్‌ ! | Sakshi
Sakshi News home page

గురుకుల సీట్లకు భలే క్రేజ్‌ !

Published Sun, Jun 23 2019 2:11 AM

Huge craze for Gurukul seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలకు క్షేత్రస్థాయిలో క్రేజ్‌ పెరుగుతోంది. గురుకులాల్లో అడ్మిషన్‌ తీసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గురుకుల పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 819 గురుకుల పాఠశాలల్లో ఆయా సొసైటీలు ఐదోతరగతి అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. మొత్తం 64,140 సీట్లు ఉన్నాయి. వీటిలో మైనార్టీ గురుకుల పాఠశాలలు మినహా ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్‌ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి టీజీసెట్‌ృ2019 అర్హత పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలోనే సీట్లు కేటాయిస్తున్నారు.

ఈ నాలుగు సొసైటీల పరిధిలో 47,740 సీట్లు ఉండగా...తొలివిడత కౌన్సెలింగ్‌లో ఏకంగా 83.76% విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. మరో రెండ్రోజుల సమయంలో మరికొందరు ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. ఈనెల 25 వరకు తొలివిడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి 26న రెండో విడత జాబితాను ఇచ్చేందుకు టీజీసెట్‌ కన్వీనర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో 47,740 సీట్లు ఉండగా ఇప్పటికే 39,990 మంది ప్రవేశాలు పొందారు. ఈనెల 25 తర్వాత ఉన్న ఖాళీల ఆధారంగా రెండో విడత జాబితా విడుదల చేస్తారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల ఆధారంగా మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించే అంశంపై టీజీసెట్‌ నిర్ణయం తీసుకుంటుంది. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 16,400 సీట్లు ఉన్నాయి. ఈ గురుకులాల్లో కూడా అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ...ఇప్పటివరకు ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యను ఇంకా ఆ సొసైటీ విడుదల చేయలేదు. 

సొసైటీల వారీగా ఉన్న పాఠశాలలు, ఐదో తరగతిలో సీట్ల వివరాలు 


వచ్చే నెల 15కల్లా పూర్తి 
గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను జూలై 15కల్లా పూర్తి చేయాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఈనెల 26న రెండో విడతలో దాదాపు అన్ని సీట్లు భర్తీ అవుతాయని సొసైటీలు అంచనా వేస్తున్నాయి. రెండోవిడత పరిస్థితిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. అన్ని గురుకులాల్లో ఐదోతరగతికి ఉమ్మడి పరీక్ష నిర్వహించగా... 6,7 తరగతుల్లో ఖాళీల భర్తీకి సొసైటీలు విడివిడిగా పరీక్షలు నిర్వహించాయి.

బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కావడంతో సీట్ల భర్తీకి ప్రత్యేక పరీక్ష నిర్వహించింది. వీటిల్లోనూ 90% సీట్లు భర్తీ అయినట్లు బీసీ గురుకుల సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో ఖాళీలను కూడా ఇదే తరహాలో భర్తీ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నిర్దేశించిన స్కూల్‌లో అడ్మిషన్‌ పొందినప్పటికీ స్కూల్‌ మార్పు చేసుకునే అంశంపై గురుకుల సొసైటీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సుదూర ప్రాంతాల్లోని స్కూళ్లలో సీట్లు పొందిన విద్యార్థులు మార్పు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement
Advertisement