ఘనంగా తెలం‘గానం’ | Sakshi
Sakshi News home page

ఘనంగా తెలం‘గానం’

Published Tue, Dec 12 2017 2:16 AM

Huge decoration at LB stadium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన ఓరుగల్లు కొన్ని వందల ఏళ్ల క్రితం, అంటే మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ హయాంలో కొంతకాలం పాటు సుల్తానాబాద్‌గా పేరు మార్చుకుంది! అంతేనా... ముల్క్‌–ఎ–తెలంగాణ పేరిట ఓ నాణేన్నీ విడుదల చేశాడు తుగ్లక్‌!! దక్షిణాదిలో లభించిన తుగ్లక్‌ నాణెం ఇదొక్కటే!!! ఈ నాణెం డిసెంబర్‌ 15 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికైన ఎల్‌బీ స్టేడియంలో ఆహూతులకు కనువిందు చేయనుంది. ఇలాంటి మరెన్నో విశేషాలతో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషా విభవాన్నే గాక తెలంగాణ ఘన చరిత్రనూ ప్రపంచానికి చాటనున్నాయి. అరుదైన, పురాతన నాణేలు, శాసనాలు, కాలగర్భంలో కలిసిపోయిన ప్రాచీన ఆలయాల నమూనాలు, చరిత్రను తెలియజెప్పే పుస్తకాలు తదితరాలు మహాసభల వేదికపై కొలువుదీరనున్నాయి. 

శ్రీశైలం ప్రాజెక్టులో అదృశ్యమైన ఆలయాలు చూస్తారా... 
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఎన్నో అద్భుత, చారిత్రక దేవాలయాలు నీట మునిగి కనుమరుగయ్యాయి. వాటి నమూనాలను పురావస్తు శాఖ అప్పట్లోనే రూపొందించింది. కృష్ణా, తుంగభద్ర నదీ తీరాల్లోని అలంపూర్, ప్రాగటూరు, జట్‌ప్రోలు తదితర ప్రాంతాల్లో నిర్మితమైన ఈ ఆలయాల నమూనాలను పురావస్తు శాఖ ఆధీనంలోని హెరిటేజ్‌ సెంటినరీ (శ్రీశైలం పెవిలియన్‌) మ్యూజియంలో ఉంచారు. వాటిలోంచి ముఖ్యమైన పది నమూనాలను తెలుగు మహాసభల వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇవేగాక మన చరిత్ర ఘనతను తెలియజెప్పే 100 వరకు పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని కొనుక్కోవచ్చు కూడా!
 
శిల్పాల ప్రదర్శనకు వెనకడుగు!
ఇటీవల ముంబై ఛత్రపతి శివాజీ ప్రదర్శనాలయంలో బ్రిటిష్‌ మ్యూజియంతో కలసి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో విదేశీయులను సైతం బాగా ఆకట్టుకుంటున్న శిల్పం తెలంగాణదే. బుద్ధుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను మూడు భాగాలుగా చిత్రించిన ఆ నాలుగున్నర అడుగుల శిల్పం సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించింది. ఇలాంటి మరెన్నో అద్భుత పురాతన శిల్పాలు మన మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇవి కనువిందు చేస్తే సందర్భోచితంగా ఉండేదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి మహాసభల వేదిక వద్ద పురావస్తు విశేసాలను ప్రదర్శనకు ఉంచాలన్న ఆలోచనే అధికారుల్లో తొలుత లేదు! ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం పురమాయించడంతో పురావస్తు శాఖ హడావుడిగా రంగంలోకి దిగింది. తక్కువ సమయంలోఅరుదైన ఆ విగ్రహాలను వేదికకు తరలించడం తదిరాలు కుదరకపోవచ్చనే అను మానంతో ఇలా నాణేలు, శాసన నకళ్లు, పుస్తకాలతో అధికారులు సరిపెడుతున్నారు.

- తెలంగాణ ఘన చరిత్రకు సజీవ జ్ఞాపకంగా మిగిలిన దాదాపు 140 అరుదైన నాణేలను ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక వద్ద వీక్షకుల కోసం ప్రదర్శనకు ఉంచుతున్నారు. ప్రాచీన కాలంనాటి ముద్రల నాణేలు (పంచ్‌ మార్క్‌డ్‌) మొదలుకుని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీల్టు, విజయనగర రాజులు, నిజాంల దాకా తెలంగాణలో చలామణీ అయిన పలు నాణేలు కొలువుదీరనున్నాయి. 

- వెయ్యేళ్ల తెలుగుగా మన భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు ఆధారభూతమైన కుడిత్యాల శాసనం చూడాలనుకుంటే తెలుగు మహాసభలకు రావాల్సిందే. ప్రస్తుత కరీంనగర్‌ జిల్లాలో తవ్వకాల్లో వెలుగు చూసిన ఈ శాసనంపై తెలుగు లిపి కనిపించింది. ఇది క్రీ.శ. 945 నాటి శాసనమని నిరూపితమైంది. సంస్కృతం, కన్నడంతోపాటు తెలుగులో కందపద్యం రాసి ఉన్న ఈ శాసనం కూడా మహాసభల్లో కొలువుదీరనుంది. దీనితోపాటు మరో నాలుగైదు పురాతన శాసనాల నకళ్లను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement