సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం

Published Sun, Feb 10 2019 3:43 AM

Huge Fire Accident in Siddipet - Sakshi

సిద్దిపేట జోన్‌: సిద్దిపేట పట్టణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హామీ ఇచ్చారు. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణం మెదక్‌ రోడ్డులో వెదురుబొంగులు, శుభకార్యాలకు అలంకరణ సామ గ్రి సరఫరాచేసే దుకాణాలు ఉన్నాయి. ఇందులో పాతకోటి రమేశ్, మహేశ్‌ అనే సోదరుల దుకాణం లో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

దుకాణం చుట్టుపక్కల కూడా వెదురుబొంగులు ఉండటంతో మంట లు వ్యాప్తి చెంది పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎగిసిపడిన మంటలతో మెదక్‌ రోడ్డు ను దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్‌లు 3గంటలపాటు సంఘటన స్థలం వద్ద ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంటనే స్పందించి పట్టణంలోని నాయకులను, అధికారుల ను అప్రమత్తం చేశారు. మంటలు వ్యాపించిన వెంటనే అందరూ రోడ్డు మీదకు పరుగులు తీయడం తో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  

Advertisement
Advertisement