కట్టుకున్నోడే కడతేర్చాడు | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కడతేర్చాడు

Published Fri, Oct 10 2014 12:09 AM

కట్టుకున్నోడే కడతేర్చాడు - Sakshi

గజ్వేల్ : డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చాడు.  భార్య ముఖంపై దిండు ఉంచి  ఊపిరాడకుండా చేసి .. చీరతో ఉరేసి అంత్యంత కిరాతంగా హతమార్చాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.. వివరాలిలా ఉన్నాయి.
 
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ఎం శ్రీనివాస్ (34)కు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన రేణుక (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సందర్భంగా రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. వీరికి దీక్షిత (3), ధీరజ్ (10 నెలలు) లు ఉన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్లలోని 400 కేవీ సబ్‌స్టేషన్‌లో వైర్‌మన్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం రావటం వల్ల భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని శ్రీనివాస్ రేణుకను తరుచూ వేధిస్తుండేవాడు. అంతేకాకుండా మద్యం పీకల దాక సేవించి శారీరకంగా హింసించేవాడు.

ఈ విషయంలో ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కుమార్తె రేణుకను అల్లుడు వేధించినప్పుడల్లా రూ. 10 వేల వరకు అప్పగించేవారు. వీటితో కొంతకాలం బాగానే ఉంటూ తిరిగి డబ్బుల కోసం గొడవపెట్టేవాడు. కొన్ని రోజుల క్రితం రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రేణుక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో రూ. 10 వేల ఇచ్చి వెళ్లారు. అయినా తనకు ఈ డబ్బులు సరిపోవని హింసించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేణుకను దిండుతో నోటిని కుక్కి ఊపిరాడకుండా చేయడమే కాకుండా చీరతో ఊరేసి హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి గడియపెట్టి పిల్లలను తీసుకుని బయటకు వచ్చాడు.

రాత్రి పది గంటల వరకు రోడ్డుపైనే తిరిగాడు. ఆ తర్వాత అక్కన్నపేటలోని తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబీకులకు శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. దీంతో వారు ఇక్కడికి చేరుకుని పిల్లలను తమ వద్దకు తీసుకున్నారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నేరుగా పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. దీంతో అదే రాత్రి సీఐ అమృతరెడ్డి, ఎస్‌ఐ జార్జిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులకు అందించారు. తెల్లవారుజామున వారు ఇక్కడికి చేరుకుని బోరున విలపించారు.
 
ఈ సందర్భంగా రేణుక తండ్రి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కాలంగా నా బిడ్డను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నా.. మారుతాడోమేనని అనుకున్నాం.. ఎన్నోసార్లు అడిగి కాడికి డబ్బులిచ్చాం.. గిప్పుడు ప్రాణాలే తీసిండు.. అంటూ రోదించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అమృతరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే అభం శుభం తెలియని చిన్నారులు దీక్షిత, ధీరజ్‌లు పిన్న వయసులో కన్నతల్లిని కోల్పోవడం పలువురిని కలచి వేసింది. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement