పారదర్శక పాలనే అజెండా! | Sakshi
Sakshi News home page

పారదర్శక పాలనే అజెండా!

Published Sun, Jan 18 2015 3:48 AM

పారదర్శక పాలనే అజెండా! - Sakshi

ప్రభుత్వ భూముల పరిరక్షణ
క్రమబద్ధీకరణకు అదనపు కౌంటర్లు
జిల్లాలో రెండు నిర్భయ కేంద్రాలు
ఆసరాపై ఫిర్యాదులు లేకుండా చేస్తా
విద్యా ప్రమాణాలు మెరుగునకు చర్యలు
సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తాం
‘సాక్షి’తో హైదరాబాద్ కలెక్టర్ నిర్మల


సాక్షి, సిటీబ్యూరో: పారదర్శక పాలన.. ప్రజా ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం.. పేదలకు పక్కా ఇళ్లు.. విద్యారంగంలో వెనుకబాటుకు చెక్.. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిచడం.. మహిళా రక్షణకు నిర్భయ కేంద్రాలు..ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు.. ఉద్యోగుల్లో జవాబుదారి తనాన్ని పెంచడం.. ప్రతి సోమవారం నిర్వహించేప్రజావాణి కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు.. అర్హులకు పింఛన్ల పంపిణీ.. ప్రభుత్వ భూముల పరిరక్షణ.. ఇవీ తన ముందున్న లక్ష్యాలని కలెక్టర్ కె.నిర్మల స్పష్టం చేస్తున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు.
 
ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు మండలాలు, బస్తీల వారీగా భూ వివరాలు సేకరించడంతోపాటు వాటి పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, తహశీల్దారులను ఆదేశించామని తెలిపారు. జీఓలు 58, 59లకు అనుగుణంగా ప్రభుత్వ భూముల్లోని అభ్యంతరకర ఇళ్ల క్రమబద్ధీకరణ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. పేద ప్రజలు తమ ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని తహశీల్దారులకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
 
ఆసరాపై ఫిర్యాదులు లేకుండా చేస్తా..
ఆసరా పథకం కింద అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నిర్మల తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో లక్షా నాలుగు వేల పింఛన్లు మంజూరయ్యాయని, పెండింగ్‌లో ఉన్న పింఛ న్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. చార్మినార్, ఆసిఫ్‌నగర్, బహుదూర్‌పురా మండలాల్లో పింఛన్లకు సంబంధించి సమస్యలున్నాయని, వాటిని సత్వరమే అధిగమించగలమన్నారు.

ఆహార భద్రతా కార్డులు అర్హులైన వారందరికీ అందిస్తామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం సక్రమంగా కొనసాగేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, చిన్న పిల్లల పరిపుష్టి కోసం ఒక పూట సంపూర్ణ భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
 
విద్యా ప్రమాణాల మెరుగు కోసం...
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు కోసం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణతలో హైదరాబాద్ వెనుకబడి ఉందని.... ఫలితాల మెరుగు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను మెరుగు పరచడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
 
మహిళల రక్షణ కోసం నిర్భయ కేంద్రాలు...
మహిళలపై జరుగుతున్న ఆ సాంఘిక దాడులు, గృహ హింస నుంచి కాపాడేందుకు హైదరాబాద్ జిల్లాలో రెండు నిర్భయ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యాన నగరంలో పేట్లబురుజు, గాంధీనగర్‌ల్లో నిర్భయ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. బాలికల వివాహం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు  కల్యాణ లక్ష్మి పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
 
పటిష్టంగా ‘మీ కోసం’..
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి (మీకోసం) కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఇందులో వచ్చిన ప్రజా ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనివ్వటంతోపాటు సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటామన్నారు. అప్పటివరకు దరఖాస్తులతో కలెక్టరేట్ చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దని జిల్లా ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement