ఐటీలో హైదరాబాద్‌ దూసుకెళ్తోంది | Sakshi
Sakshi News home page

ఐటీలో హైదరాబాద్‌ దూసుకెళ్తోంది

Published Fri, Dec 15 2017 2:21 AM

Hyderabad flips in IT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని, త్వరలోనే నగరాన్ని స్టార్టప్‌లకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. బెంగళూరు, గురుగ్రామ్‌లతో పోలిస్తే హైదరాబాద్‌ పర్యావరణహితంగా ఉందని, ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. రాజధానికి గత 17 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్‌ వంటి ఐదు ప్రపంచ దిగ్గజ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదని.. ఈ నగరానికి 450 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. గురువారం హైటెక్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా మిషన్‌ ఇన్నోవేషన్‌–2018 కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. టెక్‌ మహీంద్రా కేంద్ర కార్యాలయాన్ని హైద రాబాద్‌కు తరలించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ–హబ్‌ ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది టీ–హబ్‌ సెకండ్‌ ఫేజ్‌ను ప్రారంభించనున్నామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19–21 వరకు 3 రోజుల పాటు హైదరాబాద్‌లో వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ నిర్వహించబోతున్నామన్నారు. 

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌... 
ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో హైదరాబాద్‌ను వరల్డ్‌ క్లాస్‌ సిటీగా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే నగరాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. 160 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ 4 టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నామని వివరించారు. నగరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రజల దాహార్తిని తీర్చడానికి 10 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం విషయంలో నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సింగిల్‌ విండో విధానంలో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. రెండు న్నరేళ్లలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో 5,500కుపైగా పరిశ్రమలు వెలిశాయన్నారు.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసు కుపోతోందని, దేశంలోనే అత్యంత ఘనమైన ఆర్థికాభివృద్ధి తెలంగాణలో నమోదైందన్నారు. రోజు వారీ జీవితంలో టెక్నాలజీ కీలకంగా మారిందన్న కేటీఆర్‌... విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధ మయ్యే విద్యార్థులకు టీ–శాట్‌ చానల్స్‌ ద్వారా డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement