Sakshi News home page

హైదరా‘బ్యాడ్‌’ రోడ్లు!

Published Sun, Apr 1 2018 3:30 AM

Hyderabad Roads was too bad - Sakshi

ఇలా ఎవరన్నారు? ఎందుకన్నారు?  
సోది లేకుండా స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి పోదాం.. 

ఎవరన్నారు? 
మారుతీ సుజుకీ రహదారి భద్రత సూచిక.. ఏటా ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తుంది. 2017కి సంబంధించినది తాజాగా విడుదలైంది. ఆ నివేదికలో ఓవరాల్‌గా నగరానికి చివరి స్థానం దక్కింది.   

ఎందుకన్నారు? 
రహదారి భద్రత సూచిక కోసం ఓ 12 పరామితులను ప్రామాణికంగా పెట్టుకున్నారు. దాని ఆధారంగా దేశంలోని 10 ప్రముఖ నగరాల్లో క్షుణ్నంగా సర్వే చేశారు. ఒక్కో నగరానికి సంబంధించి 1,000–1,200 మందిని ప్రశ్నించి..వివిధ అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. అందులో తేలిన అంశాల ఆధారంగా ఈ నిర్ణయానికొచ్చారు. 

ఏమిటా 10 నగరాలు? ఏమిటా 12 పరామితులు? 
సర్వే చేసిన నగరాలు: హైదరాబాద్,  రాయ్‌పూర్, ఇండోర్, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై

పాదచారుల హక్కులు:  రద్దీ ఉన్న రహదారులపై జీబ్రా క్రాసింగ్స్, సైకిలింగ్‌ ట్రాక్స్‌..కొన్ని చోట్ల నో వెహికల్‌ డేలు పాటించడం వంటివి జరగాలి. ముఖ్యంగా మెట్రో వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు పాదచారులు నడవటానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. ఇలాంటి పనులు జరిగినప్పుడు తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు.
- ఈ విభాగంలో విజేత: రాయ్‌పూర్‌ 

రోడ్ల నిర్వహణ, లైటింగ్‌: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై తగినంత లైటింగ్‌ ఉండాలి. సుందరీకరణలో భాగంగా విభిన్నమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూలమైన సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడం.. 
విజేత: కోల్‌కతా 

మోటారు చట్టాలు, ట్రాఫిక్‌ నియంత్రణ: రాత్రి వేళల్లో పెట్రోలింగ్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే తగు జరిమానాలు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్‌ మీడియాను వినియోగించుకోవడం, రద్దీ వేళల్లో  సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించడం..     
విజేత: చెన్నై 

అత్యవసర సేవలు:  ఏ ఉత్పాతం జరిగినా తగు విధంగా స్పందించేలా అత్యవసర సేవల విభాగాలను తీర్చిదిద్దడం.. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వంటివాటికి దారి ఇచ్చేలా వాహన చోదకులకు అవగాహన కల్పించడం, ఫుట్‌పాత్‌లు, రోడ్లపై అక్రమణలను తొలగించేలా చేయడం.. దీని వల్ల అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు వెళ్లడానికి వీటిని వాడుకోవచ్చు.     
విజేత: అహ్మదాబాద్‌ 

రోడ్ల శుభ్రత: ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయడం.. ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. చెత్త తరలించే వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ట్రాకింగ్‌ చేయడం.. నగరంలో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్‌ను రోడ్లు నిర్మాణం, రిపేర్లకు పునర్వినియోగించడం.     
విజేత: ఇండోర్‌ 

కనెక్టివిటీ: అంతర్గత రోడ్లకు, ప్రధాన రహదారులకు మధ్య కనెక్టివిటీ.. ఫ్లైఓవర్లు.. నగరంలో విస్తృతంగా మెట్రో, ట్రామ్, రైలు సదుపాయాలు.. 
విజేత: ఢిల్లీ 

రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: బస్సుల ప్రయాణానికి ప్రత్యేకమైన లేన్లు, తగు పార్కింగ్‌ సదుపాయాలు, వరదలు వంటివి రాకుండా నీరు నిలవకుండా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ    
విజేత: అహ్మదాబాద్‌ 

రహదారి భద్రత: ప్రమాదాల నియంత్రణ, సీటుబెల్టు, హెల్మెట్లు పెట్టుకునేలా చూడటం.స్పీడ్‌ బ్రేకర్లు, స్పీడ్‌ గన్స్, ట్రాఫిక్‌ సైన్స్‌ ఏర్పాటు.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు అనుసరించే తీరు..      
విజేత: రాయ్‌పూర్‌ 

చిన్నపిల్లల భద్రతకు అనుకూలమైన వాతావరణం: స్కూళ్లు, నివాస ప్రాంతాల వద్ద స్పీడ్‌ బ్రేకర్ల ఏర్పాటు.  సురక్షిత డ్రైవింగ్‌పై బస్సు డ్రైవర్లకు, రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం.    
విజేత: కోల్‌కతా 

దివ్యాంగులకు అనుకూలంగా: రవాణా వాహనాల్లో వీరికి ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేయడం.. రద్దీ ప్రదేశా ల్లో రోడ్లు దాటడానికి వాయిస్‌ ఇండికేటర్స్‌.. వాళ్ల కోసం ప్రత్యేకమైన క్యాబ్‌లు.. బస్సుల్లో రాయితీ టికెట్‌పై ప్రయాణం..
విజేత: ముంబై 

రోడ్ల నాణ్యత: గుంతలు లేకుండా అత్యుత్తమమైన రహదారుల నిర్మాణం.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడం..  
విజేత: ఢిల్లీ 

భారీ వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ: రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించకుండా కచ్చితమైన పర్యవేక్షణ, వాటి కోసం ప్రత్యేకమైన రహదారుల ఏర్పాటు..వాహనాల ఓవర్‌ లోడింగ్‌ నియంత్రణ          
విజేత: అహ్మదాబాద్‌..

చివరగా...
ఈ 12 విభాగాల్లోనూ వచ్చిన మార్కుల ఆధారంగా రాయ్‌పూర్‌కు మొదటి స్థానం దక్కగా.. హైదరాబాద్‌కు చివరి స్థానం దక్కింది. రహదారుల భద్రత, చిన్నపిల్లల భద్రతకు అనుకూల వాతావరణం విభాగాల్లో తప్ప అన్నింటిలోనూ నగరానికి చివరి స్థానమే వచ్చింది. ఈ రెండింటిలో 9వ స్థానం దక్కింది.   
 – సాక్షి, తెలంగాణ డెస్క్‌   

Advertisement

తప్పక చదవండి

Advertisement